Sanjay raut: నన్ను చంపినా సరే ఆ రూట్‌ని ఆశ్రయించను: రౌత్‌

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం (Maharashtra crisis) కొనసాగుతున్న వేళ తనకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay raut) స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో....

Updated : 27 Jun 2022 15:45 IST

ముంబయి: మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం (Maharashtra crisis) కొనసాగుతున్న వేళ తనకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay raut) స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ (ED) సమన్లు ఇవ్వడం తనను అడ్డుకొనేందుకు జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. తనను చంపినా సరే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల మాదిరిగా గువాహటి మార్గాన్ని ఆశ్రయించబోనన్నారు. మహారాష్ట్రలోని పాత్రచాల్‌ (Patra Chawl) అభివృద్ధి ప్రాజెక్టులో మనీలాండరింగ్‌ (Money Laundering) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌ రౌత్‌కు ఈడీ సోమవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని సూచించింది. అయితే, మంగళవారం   అలీబాగ్‌లో ఓ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున ఈడీ ముందు  హాజరు కాలేనని సంజయ్‌ రౌత్‌ స్పష్టంచేసినట్టు సమాచారం. 

శివసేన నేత, మంత్రి ఏక్‌నాథ్‌ శిందే నాయకత్వంలో పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి తిరుగుబాటు చేసి అస్సాంలోని గువాహటిలో బస చేయడంతో మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో గత ఆరు రోజులుగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను దారికి తెచ్చి తమ ప్రభుత్వాన్ని కాపాడుకొనే ప్రయత్నాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సంజయ్‌ రౌత్‌కు తాజాగా ఈడీ సమన్లు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఈడీ నాకు సమన్లు జారీ చేసిన విషయం ఇప్పుడే తెలిసింది. మంచిది. మహారాష్ట్రలో ఇప్పుడు కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. బాలాసాహెబ్‌  శివసైనికులమంతా ఈ యుద్ధంలో పోరాడుతున్నాం. నన్ను ఆపేందుకు ఇదంతా ఓ కుట్ర. మీరు నా తల తీసినా సరే గువాహటి రూట్‌లో వెళ్లను.. నన్ను అరెస్టు చేసుకోండి’’ అని ట్వీట్‌ చేశారు. అలాగే, అంతకుముందు ఇదే అంశంపై మరాఠాలో చేసిన ట్వీట్‌కు భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ను ట్యాగ్ చేశారు.  మరోవైపు, భాజపాను వ్యతిరేకిస్తున్నందున భయపెట్టేందుకే  ఈడీ నోటీసులు పంపిందని సంజయ్‌ రౌత్‌ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ రౌత్‌ విమర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని