BJP: ఇప్పుడున్నది అసలైన కాంగ్రెస్‌ కాదు.. ‘ఇటాలియన్‌ కాంగ్రెస్‌’..!

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించిన కాషాయ పార్టీ నేతలు.. ఇప్పుడున్నది అసలైన కాంగ్రెస్‌ కాదని, ఇటాలియన్‌ కాంగ్రెస్‌ అని ఆరోపించారు.

Published : 21 Dec 2022 01:38 IST

దిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే క్రమంలో తమ (Congress) పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడుతోంది. దేశం కోసం భాజపా కనీసం ఒక శునకాన్నీ కోల్పోలేదని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన కేంద్ర మంత్రులు.. ప్రస్తుతమున్న కాంగ్రెస్‌ అసలైనది కాదని.. ఇప్పుడున్నది ఇటాలియన్‌ కాంగ్రెస్‌ (Italian Congress) అంటూ ఆరోపించారు.

‘ఇది అసలైన కాంగ్రెస్‌ కాదు. నిజమైన కాంగ్రెస్‌ (Congress)కు చెందిన సుభాష్‌ చంద్రబోస్‌, బాలగంగాధర్‌ తిలక్‌, సర్దార్‌ పటేల్‌ వంటి నేతలతో కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా వ్యవహరించిందో అందరికి తెలుసు. ప్రస్తుతమున్నది ఇతరులు సారథ్యం వహిస్తోన్న ఇటాలియన్‌ కాంగ్రెస్‌’ అని పరోక్షంగా సోనియా గాంధీ(Sonia Ganfhi)ని ప్రస్తావిస్తూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మండిపడ్డారు. బోగస్‌ నేతలతో కూడిన బోగస్‌ పార్టీ ‘కాంగ్రెస్‌’ అని పేర్కొన్న ఆయన.. ఆ పార్టీ అధ్యక్షుడు ఓ రబ్బర్‌ స్టాంప్‌ అని విమర్శించారు. కాంగ్రెస్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపిస్తూ.. స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్‌ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ (Mahatma Gandhi) సూచించిన అంశాన్ని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే (Mallikarjun Kharge) వాడిన భాషపై కేంద్ర మంత్రి కిరన్‌ రిజుజు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరించడం వల్లే రాజకీయ నేతలు ప్రజల దృష్టిలో అవహేళనకు గురవుతారని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలే కాంగ్రెస్‌ పార్టీ పతనానికి కారణమవుతాయని కేంద్ర మంత్రి అశ్విని కుమార్‌ చౌబే పేర్కొన్నారు. గతంలోనూ సాయుధ బలగాల విషయంలో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని