Yanamala: జాతీయ నేతలకు చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పమన్నారు: యనమల
తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు. తప్పులు చేసిన నాయకులే ఆయన్ను ఈ కేసులో ఇరికించారు. తప్పుడు కేసులతో ఈ ప్రభుత్వం చంద్రబాబును వేధిస్తోంది. జైలులో ఆయన సంతోషంగా లేరు. పార్టీ కార్యకర్తల గురించి అడిగారు. చంద్రబాబు చేసిన కార్యక్రమాల వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందింది. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. వైకాపా ప్రభుత్వం వల్ల ప్రజలంతా కష్టాలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. ఆయన అరెస్ట్‌ను అనేకమంది జాతీయ నేతలు ఖండించారు. సంఘీభావం తెలిపిన జాతీయ నేతలకు కృతజ్ఞతలు చెప్పమన్నారు. కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటాం. చంద్రబాబు గదిలో ఏసీ లేదు.. ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాం. ఆ గదిలో దోమలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని యనమల చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.