జగన్‌కు కేసుల భయం పట్టుకుంది: యనమల

అవినీతి, ఆర్థిక నేరాల కేసులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఎం జగన్‌కు భయం పట్టుకుందని శాసనమండలి...

Published : 17 Sep 2020 10:41 IST

అమరావతి: అవినీతి, ఆర్థిక నేరాల కేసులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఎం జగన్‌కు భయం పట్టుకుందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని హైకోర్టుల నుంచి ఈతరహా కేసుల కార్యాచరణ కూడా సుప్రీంకోర్టు సిద్ధం చేయమందని గుర్తు చేశారు. దేశంలో 4వేల కేసులు పెండింగ్‌లో ఉంటే అందులో 2500 కేసులు రాజకీయ నేతలవేనని వివరించారు. వీటిలో 12 ఛార్జ్‌షీట్లు సీబీఐ కోర్టులో జగన్‌పై దాఖలు చేసినవేనని పేర్కొన్నారు.

జగన్‌ విచారణకు భయపడి ప్రజలదృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే మంత్రివర్గ ఉప సంఘం, ఏసీబీ విచారణలు తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై విచారణ అనడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. అది చట్ట వ్యతిరేకం కాబట్టే హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామన్న యనమల ... పత్రికా హక్కుల గురించి ప్రకటన ఇచ్చే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలని హితవు పలికారు. సొంత మీడియా సాక్షి నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తుందో ఆత్మవిమర్శ చేసుకోవాలని యనమల సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని