Andhra News: పల్నాడులో నిరసన సెగలు... నెల్లూరులో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే

కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వివిధ రూపాల్లో తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుండగా..

Published : 11 Apr 2022 02:10 IST

మాచర్ల: కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వివిధ రూపాల్లో తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుండగా.. వారి అనుచరులు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినా రామకృష్ణారెడ్డి విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు మొండిచేయి చూపడంపై మండిపడ్డారు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాల పరిధిలో వైకాపా నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. మంత్రివర్గంలోకి తీసుకోకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌ కిషోర్‌తో పాటు 30మంది కౌన్సిలర్లు, 5మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి తన ఇంటికే పరిమితమయ్యారు. ఎవరినీ కలిసేందుకు ఇష్టపడటం లేదు. సీఎం కార్యాలయం నుంచి తనను సంప్రదించేందుకు జగన్‌ కార్యదర్శి ప్రయత్నించినా పిన్నెళ్లి అయిష్టంగా మాట్లాడి ఫోన్‌ స్విఛాఫ్‌ చేశారు.

రెంటచింతలలో రాస్తారోకో...

సీనియర్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు నిరసనగా మండల కేంద్రమైన రెంటచింతలలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై టైర్లు తగులబెట్టారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల నియోజకవర్గ మహిళా నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా.. వైకాపా నేతలు ఆమెను అడ్డుకున్నారు. 

కంటతడి పెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు:  తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో నెల్లూరు రూరల్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ‘‘పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నా. మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించింది.  మంత్రి పదవి రాలేదని బాధ ఉన్నా పార్టీ వీడను. కార్యకర్తలు, నాయకులు వారి రక్తం చెమటగా మార్చి నాకోసం కష్టపడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు’’ అని వివరించారు. నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాజీనామాలకు సిద్ధమైన వైకాపా నేతలు, కార్పొరేటర్లకు కోటంరెడ్డి నచ్చజెప్పారు. ఎవరూ రాజీనామాలు చేయవద్దని సూచించారు.

జగ్గయ్యపేటలో ఉదయభాను అనుచరుల ఆందోళన... 

మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనుచరులు భగ్గుమన్నారు. ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. పెట్రోల్‌పోసి ద్విచక్రవాహనాన్ని తగులబెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు మంటలు అంటుకున్నాయి. వారిద్దరూ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు జగ్గయ్యపేటలోని ఉదయభాను నివాసం వద్దకు వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పలువురు నాయకులు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఉదయభానుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉదయభానుకు మంత్రి పదవి దక్కకపోవడంతో కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ పదవికి తన్నీరు నాగేశ్వరరావు రాజీనామా చేశారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.  

విజయవాడలో పార్థసారధి అనుచరుల నిరసన ..

కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకుని నిరసన చేపట్టారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న అనుచరులను ఎమ్మెల్యే బుజ్జగించారు. జగన్‌ నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని పార్థసారధి తెలిపారు.

బాలినేనిని బుజ్జగించిన సజ్జల...

బాలినేని శ్రీనివాసరెడ్డికి తాజా మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో సీనియర్‌ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి నష్టం వస్తుందని పేర్కొన్నారు. ఒంగోలు నుంచి పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు విజయవాడలోని బాలినేని నివాసానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .. బాలినేని నివాసానికి వచ్చి ఆయన్ను బుజ్జగించారు. మరో వైపు బాలినేనికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఇంకొల్లు జడ్పీటీసీ పదవికి భవనం శ్రీలక్ష్మి రాజీనామా చేశారు.

తిరువూరులో...

రాష్ట్ర కేబినెట్‌లో తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి చోటు లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సహకార సంఘాలు అధ్యక్షులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. తిరువూరు జడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, విస్సన్నపేట జడ్పీటీసీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

సుచరిత అభిమానుల మనస్తాపం...

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను మంత్రివర్గంలో కొనసాగించకపోవడంపై నియోజకవర్గ పార్టీ శ్రేణులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఎస్సీ మంత్రులందరినీ కొనసాగిస్తూ సుచరితను తప్పించడమేంటని నిలదీశారు. కుటుంబంతో కలిసి సజ్జలను కలిసేందుకు 3రోజులుగా ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని సుచరిత వర్గీయులు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సంఘాల నాయకులు, అభిమానులు భారీగా సుచరిత నివాసానికి చేరుకున్నారు. ఆమెకు సంఘీభావం తెలుపుతూ గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో  నంద్యాల జిల్లా ఆత్మకూరులో ముగ్గురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆశించిన కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని