Kodali nani: జూ.ఎన్టీఆర్‌ మమ్మల్ని కంట్రోల్‌ చేయడం ఏంటి: కొడాలి నాని

రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీగా ఉన్న నటుడు జూ.ఎన్టీఆర్‌, ఆయన పేరును వివాదాల్లోకి లాక్కొస్తున్నారు తెదేపా, వైకాపా నాయకులు.

Published : 26 Nov 2021 01:56 IST

హైదరాబాద్‌: రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీగా ఉన్న నటుడు జూ.ఎన్టీఆర్‌(Jr NTR), ఆయన పేరును వివాదాల్లోకి లాక్కొస్తున్నారు తెదేపా, వైకాపా నాయకులు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు, ఆయన సతీమణిపై కొందరు వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నందమూరి కుటుంబంతో సహా, జూ.ఎన్టీఆర్‌ కూడా స్పందించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ‘అరాచక’ పాలనకు నాంది అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెదేపా నేతలు వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలు మాట్లాడుతూ.. తన శిష్యులైన మంత్రి కొడాలి నాని, వంశీలను ఎన్టీఆర్‌ కంట్రోల్‌ చేయాలని, వాళ్లను తనదైన శైలిలో హెచ్చరించాలని సూచించారు.

దీంతో గురువారం మంత్రి కొడాలి నాని స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కడపలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా విజయం సాధించింది. తెదేపా అధినేత చంద్రబాబుకంటే ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మా పార్టీకే ఎక్కువగా ఉంది. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారు. నాకు, వంశీకి ఎలాంటి భద్రతా అవసరం లేదు. దమ్ముంటే చంద్రబాబుకు కూడా సెక్యురిటీని వదిలి బయటకు రావాలి. జూ.ఎన్టీఆర్‌ మమ్మల్ని ఎందుకు కంట్రోల్‌ చేస్తాడు? మేము ఏమైనా ఆయన దర్శకులమా? లేదా ఆయన వద్ద నటన నేర్చుకున్నామా? నేను, వంశీ ఆయన శిష్యులమని వర్ల రామయ్య అనడం సరికాదు.  ఆయనే స్వయంగా పెంచి పోషించిన ఎంతోమంది ఎన్నో మాటలు అంటే వాళ్లను చంద్రబాబు ఎందుకు కంట్రోల్‌ చేయడం లేదు’’

‘‘సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కొట్టిన దెబ్బకు వర్లరామయ్య వంటి వాళ్లకు బుర్ర పనిచేయడం లేదు. సంబంధం లేని వాళ్లను ఇందులోకి తీసుకొస్తున్నారు. మాకూ జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఏంటి సంబంధం? ఒకప్పుడు కలిసి ఉన్నాం. విభేదాలు వచ్చాయి. బయటకు వచ్చేశాం. మేము వైకాపాలో ఉన్నాం. మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన చెప్పింది చేస్తాం. చెప్పకపోయినా చేస్తాం. వర్ల రామయ్య పంచాయతీ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరు. ఆయన స్టేట్‌మెంట్‌లకు కూడా నేనే సమాధానం చెప్పాలంటే కష్టం కదా! ఎన్టీఆర్‌ కుటుంబం అంటే అందరికీ అభిమానమే. వాళ్లంతా అమాయకులు. చంద్రబాబు మాటలు విని వాళ్లు అలా మాట్లాడి ఉంటారు. నాకూ, వంశీకి  వాళ్లమీద జాలి వేస్తోంది’’ అని కొడాలి నాని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని