Andhra News: రాజధానికి రాచపుండు!

ఇసుక తవ్వాలన్నా, తరలించాలన్నా ఐదారు ప్రభుత్వశాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. కానీ, ఒక్క అనుమతీ లేకుండా దర్జాగా ఇసుక తవ్వి తరలించే బరితెగింపు అమరావతిలోని ఒక వైకాపా నాయకుడి సొంతం.

Updated : 10 Jul 2024 07:37 IST

రూ.వందల కోట్లు కొల్లగొట్టిన ఘనుడు
కృష్ణా తీరాన అడ్డగోలుగా ఇసుక దోపిడీ 
రాజధాని ప్రాంతంలో విధ్వంసమే లక్ష్యం
మాజీ ప్రజాప్రతినిధి అక్రమాల బాగోతం 

కృష్ణానది నుంచి అక్రమంగా తరలించి కరకట్ట వెంబడి నిల్వ చేసిన ఇసుక 

ఈనాడు, అమరావతి: ఇసుక తవ్వాలన్నా, తరలించాలన్నా ఐదారు ప్రభుత్వశాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. కానీ, ఒక్క అనుమతీ లేకుండా దర్జాగా ఇసుక తవ్వి తరలించే బరితెగింపు అమరావతిలోని ఒక వైకాపా నాయకుడి సొంతం. గత ప్రభుత్వంలో ముఖ్యనేత అండ చూసుకుని రాజధాని ప్రాంతంలో కృష్ణానదీ తీరాన్ని ఐదేళ్లపాటు చెరబట్టారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేసి ప్రైవేటు సైన్యంగా మార్చుకుని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెలరేగిపోయారు. ఇసుకను అక్రమంగా తరలించి రూ.వందల కోట్లకు పడగలెత్తారు. చీకటి పడితే చాలు వందల లారీల మోతలతో హోరెత్తించారు. ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టించేవారు. ఒకప్పుడు తన ఎదుగుదలకు సాయమందించిన వారినీ బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు. రాజధాని విధ్వంసానికీ తెగబడ్డారు. నిర్మాణ సామగ్రిని కొల్లగొట్టి రూ.కోట్లు వెనకేసుకున్నారు. రోడ్లు తవ్వేశారు. సీఆర్డీయే స్థలాన్ని ఆక్రమించి భవనం నిర్మించుకున్నారు. పోలీసు కేసుల సమయంలో అనుచరులు, బినామీలను ఇరికించి బయటపడేవారు. ఐదేళ్లుగా ప్రభుత్వ పెద్దల అండతో సాగించిన అరాచకాలకు ప్రభుత్వం మారిన తర్వాతైనా అడ్డుకట్ట పడుతుందా అని రాజధాని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

కృష్ణానది తీరంలో అనధికారికంగా నిర్మిస్తున్న విలాసవంతమైన భవనం 

ఇసుక దోపిడీకి ప్రత్యేక వ్యవస్థ 

అధికారం అండతో వైకాపాకు చెందిన ఆ నాయకుడు (మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు) ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి రీచ్‌ల పరిధిలో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరిపి నిత్యం వందల లారీల ఇసుక తరలించారు. కరోనా సమయంలోనూ తవ్వకాలు ఆగలేదు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిన అప్పటి ప్రభుత్వం ఇక్కడ మాత్రం ఆ నాయకుడికే వదిలేసింది. దీంతో సొంత మనుషులు, అనుచరుల చేత పొక్లెయిన్లు, లారీలను కొనిపించి మరీ.. ఇసుక తరలించి జేబు నింపుకొన్నారు. ఇక్కడ పరిశీలనకూ ఏ అధికారి ధైర్యం చేయలేకపోయారు. కృష్ణానది కరకట్ట వెంబడి ఎక్కడపడితే అక్కడ ఇసుక నిల్వ చేశారు. వీటి నుంచి ఇటీవలి వరకూ రాత్రివేళ ఇసుక తరలించారు.

ఎన్నికల నిధులకు ఇసుక సొమ్ము 

డెల్టా ప్రాంతం నుంచి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో వైకాపా నుంచి రెండోసారి పోటీకి దిగిన ఈ నేత ఎన్నికల కోసం ఇసుక అక్రమార్జనే ఉపయోగించారు. మరోవైపు ఎన్నికల పేరుతో వసూళ్లకూ పాల్పడ్డారు. ఒక్కో ఇసుక లారీకి రూ.70 వేల చొప్పున ఇవ్వాలని వాటి యజమానులను డిమాండు చేశారు. అమరావతి మండలం లేమల్లె వద్ద ఆయన అనుచరులు ఇసుక తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుంటే వారిపై దౌర్జన్యానికి దిగడంతో కేసు నమోదైంది. రాత్రివేళ ఇసుకతో వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇసుకను రోడ్డుపై దింపేసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటాడి పట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పోయినా అక్రమాలు కొనసాగించడం ఆయనకే చెల్లింది.  

రోడ్లు తవ్వుకుపోయిన దొంగ!  

అమరావతిలో నిర్మాణాలకు తెచ్చిన సామగ్రి గత ఐదేళ్లలో యథేచ్ఛగా చోరీకి గురైంది. ఇనుము, ఇసుక, కంకర, పైపులు, ఇతర సామగ్రిని రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లేవారు. వీటన్నిటి వెనుక రాజధాని ప్రాంతానికి చెందిన ఆ నాయకుడి హస్తం ఉందనేది అందరికీ తెలిసిన విషయం. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చి నామమాత్రపు కేసులు పెట్టి ఇంటికి పంపించడం ఇక్కడి పోలీసులకు ఆనవాయితీ. రాజధాని భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వి మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో అమ్ముకున్నారు. సదరు నేత అక్రమాలకు అడ్డుగా ఉంటున్నారని సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో తన అరాచకాల్లో జోక్యం చేసుకోకుండా చేసిన ఘనత ఆయనకే దక్కింది. 

జీవిత చరిత్రతో సినిమా!:  ప్రస్తుతం ఆయన అక్రమ సంపాదనతో రూ.కోట్లు వెచ్చించి తన జీవిత చరిత్రను వెండి తెరపైకి ఎక్కించే పనిలో ఉన్నారు. సినిమా తీసేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నిగ్గుతేలాల్సి ఉంది.


దందాలు.. దౌర్జన్యాలు

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన మాజీ ప్రజాప్రతినిధి ఆక్రమించిన సీఆర్డీయే స్థలం 

రాజధాని ప్రాంతంలో ఆయన నివాసానికి, సీడ్‌ యాక్సెస్‌ రహదారికి మధ్యలో ఉన్న సీఆర్డీయే స్థలాన్ని ఆ నేత ఆక్రమించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు స్థలం స్వాధీనం చేసుకునే యత్నం చేయలేదు. అక్కడో షెడ్డు నిర్మించి అక్రమాలకు, సెటిల్‌మెంట్లకు అడ్డాగా మార్చుకున్నారు. వాలీబాల్‌ కోర్టు ఏర్పాటు చేసుకుని ఫ్లడ్‌లైట్ల వెలుగులో అర్ధరాత్రి వరకు అనుచరులతో కలసి ఆడుతూ చుట్టుపక్కల వారికి నిద్రలేకుండా చేశారు. ఆయన గురించి చెడుగా మాట్లాడారని గుడివాడకు చెందిన ఓ యువకుడిని రెండు రోజులు బంధించి ఇబ్బందులకు గురిచేశారు. గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్‌లో ఓ కుటుంబంలో గొడవలను ఆసరాగా చేసుకుని రూ.కోట్ల విలువైన ఇంటిని ఆక్రమించారు. దీనిపై అప్పట్లో పెద్ద రభస జరగటంతో వదిలేశారు. విజయవాడకు చెందిన పలు స్థలాలు, ఆర్థిక వివాదాలలో జోక్యం చేసుకుని సెటిల్‌మెంట్లు చేశారు. మూడేళ్ల క్రితం కృష్ణానది కరకట్ట మార్గంలో కారు ఢీకొని ఒకరు మరణిస్తే.. వాహన యజమానిని బెదిరించి రూ.25 లక్షలు వసూలు చేశారు. బాధిత కుటుంబానికి మాత్రం రూ.5 లక్షలే ఇచ్చారు. మందడంలో బహుళ అంతస్తుల భవనాన్ని కారుచౌకగా కొట్టేశారు. నదీతీరంలో నిర్మాణాలపై నిషేధం ఉన్నా కరకట్ట లోపల అనధికారికంగా విశాలమైన భవనాన్ని నిర్మించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని