
Raghurama: పింఛన్లు ఎలా ఎగ్గొట్టాలన్న ఆలోచన మానుకోవాలి: రఘురామ
నవరత్నాలు రాలిపోయే రత్నాల పరిస్థితికి వచ్చాయని విమర్శ
దిల్లీ: ఏపీలో నవరత్నాలు రాలిపోయే రత్నాల పరిస్థితికి వచ్చాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. విద్యుత్ బిల్లులు రూ.300 దాటితే డయాలసిస్ రోగులకు పింఛన్లలో కోత విధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గ్రామ వాలంటీర్ల తల్లిదండ్రులకు సైతం పింఛను రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాలు నెమ్మదిగా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న రత్నాలుగా మారాయన్నారు. కరెంటు యూనిట్లకు కిడ్నీ రోగులకు ఇచ్చే పింఛనుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కిడ్నీ రోగులను నాలుగు కాలాల పాటు బతకనివ్వండంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పనిచేసే వాలంటీర్లు ఉద్యోగులు కాదు.. సేవకులని మనమే అంటున్నామని.. అలాంటి సేవకుల కుటుంబాలను ‘షేవ్’ (SHAVE) చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అడుగుతున్నారన్నారు. పింఛన్లకు ఏదో ఒక విధానం పెట్టాలి తప్ప ఎలా ఎగ్గొట్టాలన్న ఆలోచనను మానుకోవాలని హితవుపలికారు.