Published : 18 Jul 2021 01:23 IST

సీఎం యడియూరప్ప రాజీనామా చేస్తారా?

జాతీయ మీడియాలో జోరుగా ఊహాగానాలు

దిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప హస్తిన పర్యటనతో ఆయన రాజీనామాపై వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ అధిష్ఠాన పెద్దలతో వరుస భేటీలతో ఈ వార్తలకు ప్రాధాన్యం చేకూరింది. కర్ణాటక భాజపాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు కొద్ది నెలలుగా బహిర్గతం కావడం ఆయనకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్య కారణాలను చూపుతూ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని మోదీ వద్ద యడియూరప్ప ప్రస్తావించినట్టు జాతీయ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, యడ్డీ రాజీనామాను ఆమోదించాలా.. వద్దా? అనే అంశంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కథనాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే మాత్రం జూలై 26 కల్లా (సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతాయి) కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఆ వార్తల్ని కొట్టిపారేసిన యడ్డీ..

మరోవైపు, తన రాజీనామాపై వస్తోన్న వార్తల్ని సీఎం యడియూరప్ప కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. నిన్న ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర అభివృద్ధి పనులపైనే చర్చించినట్టు తెలిపారు. ఆగస్టులో మరోసారి దిల్లీకి వస్తానన్నారు. రాజీనామాపై వచ్చే ఇలాంటి వార్తలకు విలువ ఉండదన్నారు. తన తనయుడు విజయేంద్రకు పార్టీలో మంచి స్థానం కల్పించాలన్న షరతుతో యడియూరప్ప తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించినట్టు కూడా ఊహాగానాలు వస్తుండటం గమనార్హం. దీనికితోడు, 79 ఏళ్ల యడియూరప్ప రాజీనామా చేయాలని మరో వర్గం డిమాండ్‌ చేస్తోంది. ఆయన వయస్సు ఎక్కువగా ఉండటంతో 2023 ఎన్నికల్లో కొత్త ముఖాన్ని ప్రొజెక్ట్‌ చేస్తే మంచిదని మరికొందరు నేతలు భావిస్తున్నట్టు సమాచారం. 

పార్టీ బలోపేతంపైనే చర్చించా..

తన కుమారుడు విజయేంద్రతో కలిసి నిన్న ఛార్టర్డ్‌ విమానంలో దిల్లీకి వెళ్లిన యడియూరప్ప నిన్న ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ రోజు ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాపై వస్తోన్న ఊహాగానాలను కొట్టిపారేశారు. పార్టీని బలోపేతం చేయడం, 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తేవడంపై నడ్డాతో చర్చించినట్టు యడియూరప్ప వెల్లడించారు. యూపీలో 100శాతం అధికారంలోకి రాబోతున్నామని, కర్ణాటకలోనూ అదే తరహాలో వస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారన్నారు. కర్ణాటకలో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, పార్టీని బలోపేతం చేసేందుకు మరింత బాగా పనిచేయాలని సూచించారని చెప్పారు. మోదీతో జరిగిన చర్చల్లో కూడా రాష్ట్రంలో పెండింగ్‌ పనులు, పార్టీ బలోపేతం అంశాలే చర్చకు వచ్చాయని పేర్కొన్నారు. 

సొంత పార్టీలోనే అసమ్మతి జ్వాల

యడియూరప్పకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా సొంత పార్టీలోనే కొందరు నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. దీంతో నాయకత్వ మార్పు తప్పదంటూ పలుమార్లు వార్తలు వచ్చినా అధిష్ఠానం జోక్యంతో మళ్లీ అవి సద్దుమణిగినట్టు కనబడుతున్నాయి. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌, పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్‌, ఎమ్మెల్యే ఏహెచ్‌ విశ్వనాథ్ ఇటీవల యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్రపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అరుణ్‌ సింగ్‌ సమావేశం నిర్వహించి నేతల మధ్య సంధి కుదర్చడం, యడియూరప్ప బాగా పనిచేస్తున్నారంటూ కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో, రాష్ట్రంలో త్వరలో కేబినెట్‌ విస్తరణ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసమ్మతి స్వరం వినిపించిన నేతలకు కేబినెట్‌ విస్తరణలో చోటు కల్పించి తద్వారా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి 2023 ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో భాజపా ముందుకెళ్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని