
పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం యడ్డీ డిన్నర్ వాయిదా!
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వ నాయకత్వ మార్పుపై వస్తోన్న అనేక ఊహాగానాల మధ్య సీఎం యడియూరప్ప భాజపా ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన విందు సమావేశం వాయిదా పడింది. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 25న రాత్రి 7గంటలకు నగరంలోని ఓ హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేయగా దాన్ని వాయిదా వేసినట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, వాయిదాకు స్పష్టమైన కారణాలను మాత్రం పేర్కొనక పోగా.. మళ్లీ ఈ విందు భేటీకి కొత్త తేదీని కూడా ఖరారు చేయలేదని సమాచారం.
అలాగే, సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఈ నెల 26నాటికి రెండేళ్లు పూర్తికానుండటంతో అదే రోజు భాజపా శాసనసభాపక్ష సమావేశం కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. అ రోజు నాయకత్వ మార్పులపై వస్తోన్న ఊహాగానాలపైనా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ వార్తలువచ్చినా.. అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల యడియూరప్ప తన తనయుడితో కలిసి దిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. దీంతో నాయకత్వ మార్పు జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగిన విషయం తెలిసిందే.