Yogi Adityanath: శ్రీకృష్ణుడు మిమ్మల్ని శపిస్తున్నాడు.. అఖిలేశ్‌కు యోగి కౌంటర్‌

ఉత్తరప్రదేశ్‌ రాజకీయం ఇప్పుడు కృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతోంది. కృష్ణుడు తన కలలోకి వస్తున్నాడని, రామరాజ్యాన్ని నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు

Published : 04 Jan 2022 19:24 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ రాజకీయం ఇప్పుడు కృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతోంది. కృష్ణుడు తన కలలోకి వస్తున్నాడని, రామరాజ్యాన్ని నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. కృష్ణ భగవానుడు వారిని శపిస్తాడంటూ మాజీ సీఎంకు పరోక్షంగా గట్టి కౌంటర్‌ ఇచ్చారు. 

అసలేం జరిగిందంటే.. 

ఇటీవల భాజపా రాజ్యసభ సభ్యుడు హర్‌నాథ్‌ సింగ్‌ యాదవ్‌ పార్టీ అధిష్ఠానికి ఓ లేఖ రాశారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ ఈ సారి మథుర నుంచి పోటీ చేయాలని రాత్రి నా కలలో ఎవరో చెప్పారు. బహుశా ఆ కృష్ణ పరమాత్ముడే ఈ విషయంలో నన్ను మధ్యవర్తిత్వం చేయమని ఆదేశించి ఉంటాడు’’ అని హర్‌నాథ్‌ లేఖలో రాసుకొచ్చారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. 

దీనిపై నిన్న ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ స్పందిస్తూ.. భాజపానుద్దేశించి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘గత రాత్రి నాకు కలలో కృష్ణ భగవానుడు కన్పించి.. రామరాజ్యం నెలకొల్పడానికి త్వరలోనే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. నిన్న ఒక్క రోజే కాదు.. కృష్ణుడు ప్రతి రోజూ నా కల్లోకి వస్తాడు’’ అని అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. 

దీనికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా గట్టిగానే బదులిచ్చారు. ‘‘కొంతమందికి కృష్ణ పరమాత్ముడు తప్పకుండా కలలో కన్పిస్తాడు. వారి వైఫల్యాలకు ఇప్పుడైనా దుఃఖించమని చెప్పి ఉంటాడు. మీరు(అఖిలేశ్‌ను ఉద్దేశిస్తూ) చేయలేనిది భాజపా ప్రభుత్వం చేసి చూపిస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మథుర, బృందావనం అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నిస్తూ భగవాన్‌ శ్రీకృష్ణుడు మిమ్మల్ని శపిస్తున్నాడు’’ అని యోగి వ్యాఖ్యలు చేశారు. 

మరికొద్ది నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య లేదా మథుర నుంచి పోటీ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవల యోగి స్పందిస్తూ.. పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమే అని ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని