UP Elections: ఒవైసీ సవాలు స్వీకరించిన యోగి..!

రాబోయే ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఏఐఎమ్‌ఐఎమ్‌ నేత అసదుద్దిన్‌ ఒవైసీ నడుమ సవాళ్ల పర్వం నడుస్తోంది.

Published : 05 Jul 2021 01:00 IST

లఖ్‌నవూ: రాబోయే ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఏఐఎమ్‌ఐఎమ్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ నడుమ సవాళ్ల పర్వం నడుస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టకుండా తనను నిలువరిస్తామంటూ ఒవైసీ చేసిన సవాలును స్వీకరిస్తున్నట్టు యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం వెల్లడించారు. ఒవైసీ జాతీయస్థాయి నేత అని, దేశవ్యాప్తంగా ఆయన పట్ల ప్రజల్లో విశ్వసనీయత ఉందని పేర్కొన్నారు. యూపీలో భాజపా అధికారంలోకి రానివ్వమంటూ ఆయన చేసిన సవాలును తమ కార్యకర్తలు సైతం స్వీకరిస్తారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. కేంద్రం నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో 300 పైగా అసెంబ్లీ స్థానాలను కమలదళం కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

వచ్చే ఏడాది నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. యోగి ఆదిత్యనాథ్‌ను మళ్లీ ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం కానివ్వమంటూ శనివారం అసదుద్దీన్‌ పేర్కొన్నారు. యూపీలో భాజపా అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 403 అసెంబ్లీ స్థానాలకుగానూ.. ఓమ్‌ ప్రకాశ్‌ రాజ్‌భర్‌ నేతృత్వంలోని సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ)తో కలిసి 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆయన గతంలో తెలిపారు. అయితే మరో 9 చిన్న పార్టీలతో కలసి ‘భాగీదారీ సంకల్ప్‌ మోర్చా’ అనే కూటమిని ఎస్‌బీఎస్‌పీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ ఈ కూటమి అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని