Yogi Adityanath: కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి ఆ అన్నాచెల్లెళ్లు చాలు..!

ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవాలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోన్న వేళ కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై యూపీ ముఖ్యమంత్రి

Updated : 14 Feb 2022 14:17 IST

రాహుల్‌, ప్రియాంకపై యోగి ఆదిత్యనాథ్‌ ఘాటు విమర్శలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవాలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోన్న వేళ కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీని నాశనం చేయడానికి ఆ అన్నాచెల్లెళ్లు ఇద్దరు చాలు అంటూ ధ్వజమెత్తారు. రెండో దశ పోలింగ్‌ సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకి యోగి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి, ఆ పార్టీని పడేయడానికి ఆ అన్నాచెల్లెళ్లు(రాహుల్, ప్రియాంకలను ఉద్దేశిస్తూ) చాలు. ఇంకెవరూ అవసరం లేదు. అలాంటి పార్టీకి ఎందుకు మద్దతివ్వాలి అని ప్రజలను అడుగుతున్నా’’ అంటూ యోగి వ్యాఖ్యానించారు. రాహుల్‌, ప్రియాంకలపై యోగి గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేశారు. ఆ అన్నాచెల్లెళ్ల మధ్య గొడవులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలను ప్రియాంక కొట్టిపారేశారు. 

80 vs 20 వ్యాఖ్యలు.. మతాన్ని ఉద్దేశించినవి కావు

ఈ ఇంటర్వ్యూలో భాగంగా యూపీ రాజకీయాలు, కర్ణాటక హిజాబ్‌ వివాదం వంటి అంశాలపై యోగి మాట్లాడారు. ఇటీవల తొలి విడత పోలింగ్‌ తర్వాత ఆయన చేసిన ‘80శాతం వర్సెస్‌ 20శాతం’ వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.  రాష్ట్రంలో హిందూ, ముస్లింల జనాభాను ఉద్దేశించే యోగి అలా మాట్లాడారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. అయితే, ఈ వివాదంపై యూపీ సీఎం తాజాగా స్పందించారు. తాను మతాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ‘‘రాష్ట్రంలో 80శాతం ప్రజలు భాజపావైపు ఉన్నారు. ప్రభుత్వ అజెండాతో వీరంతా సంతోషంగా ఉన్నారు. 20శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. వీరు ప్రభుత్వం ఏం చేసినా ప్రతికూలంగానే ఆలోచిస్తారు. ఆనాడు కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను. అంతేగానీ, మతం, కులాన్ని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేయలేదు’’ అని యోగి వివరణ ఇచ్చారు. 

ఇక కర్ణాటక హిజాబ్‌ వివాదంపై స్పందిస్తూ రాజ్యాంగాన్ని అనుసరించి భారత్‌ నడుస్తోందని, అంతేగానీ, ఎలాంటి మతపరమైన చట్టాలపై ఆధారపడి పనిచేయబోదంటూ వ్యాఖ్యానించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని