Yogi Adityanath: మోదీతో యోగి ఆదిత్యనాథ్‌ భేటీ.. పార్టీ పెద్దలతోనూ వరుస సమావేశాలు

Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘన విజయం తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ తొలిసారి దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మంత్రి నరేంద్రమోదీతో ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు.

Updated : 13 Mar 2022 19:07 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘన విజయం తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ తొలిసారి దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మంత్రి నరేంద్రమోదీతో ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరి వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. భేటీ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. గత ఐదేళ్లలో యూపీ ప్రజల కోసం యోగి ఎంతో కష్టపడ్డారని, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌తో సమావేశమయ్యారు. అమిత్‌ షా, నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌నూ కలవనున్నారు. లఖ్‌నవూ నుంచి ఇవాళే దిల్లీకి వచ్చిన ఆయన.. రెండ్రోజుల పాటు ఇక్కడే మకాం వేయనున్నారని సమాచారం.

ఇటీవలి ఫలితాలల్లో 403 స్థానాలకు మిత్రపక్షాలతో కలిసి భాజపా 273 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగానే దిల్లీలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారంతో పాటు, నూతన మంత్రివర్గం ఏర్పాటువంటి అంశాలను పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన వారిలో కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఎన్నికల్లో ఓటమి చవిచూడగా.. దినేశ్‌ శర్మ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మరోవైపు ఎన్నికల్లో 10 మందికి పైగా మంత్రులు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, కేశవ్‌ప్రసాద్‌ మౌర్యకు మరోసారి శాసనమండలి ద్వారా మంత్రివర్గంలో చోటు కల్పించున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని