YS Jagan: తెదేపా దాడులను సహించం: మాజీ సీఎం జగన్‌

సర్వజన ఆసుపత్రి, వేంపల్లె: వైకాపాకు చెందిన 20 ఏళ్ల అజయ్‌రెడ్డిని తెదేపా వాళ్లు నిర్దాక్షిణ్యంగా కొట్టారని మాజీ సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 07 Jul 2024 05:32 IST

కడప్‌ రిమ్స్‌లో విలేకర్లతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్‌   

ఈనాడు- కడప, న్యూస్‌టుడే, సర్వజన ఆసుపత్రి, వేంపల్లె: వైకాపాకు చెందిన 20 ఏళ్ల అజయ్‌రెడ్డిని తెదేపా వాళ్లు నిర్దాక్షిణ్యంగా కొట్టారని మాజీ సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న అజయ్‌రెడ్డిని శనివారం ఆయన పరామర్శించి మీడియాతో మాట్లాడారు. వాహనాల్లో వచ్చి దాడిచేయడంతో అజయ్‌ ఆసుపత్రి పాలయ్యాడన్నారు. పులివెందులలో ఇలాంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని, ఈరోజు దెబ్బలు తిన్నవారు రేపు ప్రతిదాడులకు దిగేందుకు ఆయనే బీజం వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థా సక్రమంగా పని చేయట్లేదని విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలతో తమ ఓట్లను కూటమి లాక్కుందన్నారు. అమ్మఒడి రాక విద్యార్థులు, రైతు భరోసా అందక రైతులు, అక్కచెల్లెమ్మలకు నెలకు ఇస్తామన్న రూ.1500 కోసం వారు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ వెంట ఎంపీ అవినాష్‌రెడ్డి, వైకాపా నాయకులు సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కడప నగర మేయర్‌ సురేష్‌బాబు ఉన్నారు. మూడు రోజుల పర్యటనకు వచ్చిన జగన్‌ రిమ్స్‌ నుంచి పులివెందులలోని ఇంటికి చేరుకున్నారు. పలువురు నేతలు ఆయన్ను కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని