YS Jagan: కళ్లు మూసుకుంటే ఐదేళ్లూ గడిచిపోయాయి

అలా కళ్లు మూసుకుంటే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అలాగే ఇప్పుడూ కళ్లు మూసుకుంటే 2029 వచ్చేస్తుంది. అప్పుడు మనదే అధికారం.

Updated : 14 Jun 2024 08:56 IST

అలాగే 2029 వచ్చేస్తుంది.. అప్పుడు అధికారం మనదే
శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తారనుకోవడం లేదు
మండలిలో సభ్యులుగా మీరే కీలక భూమిక పోషించాలి
వైకాపా ఎమ్మెల్సీలతో భేటీలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌

ఈనాడు, అమరావతి: ‘అలా కళ్లు మూసుకుంటే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అలాగే ఇప్పుడూ కళ్లు మూసుకుంటే 2029 వచ్చేస్తుంది. అప్పుడు మనదే అధికారం. గతంలో ఇప్పటిలాంటి పరిస్థితి నుంచి ఎలా పైకి లేచామో.. ఇప్పుడూ అలాగే లేస్తాం. సమయం రావాలంతే’ అని వైకాపా ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చెప్పారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ‘శాసనసభలో మనం ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినా.. మనకున్న సంఖ్యాబలాన్ని బట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారనే నమ్మకం లేదు. కాబట్టి మనకున్న అవకాశం శాసనమండలి మాత్రమే. మండలిలో మనకున్న బలంతో మీరే కీలక భూమిక పోషించాలి. మనకు సమయం వచ్చేవరకూ మీదే ప్రధానపాత్ర’ అని వారితో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘అధికారంలోకి రాగానే మన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. కార్యకర్తలందరి వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పిద్దాం. సమయం గడిచేకొద్ది ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరమవుతాయి. ప్రజల్లోనే ఉంటాం.. రానున్న రోజుల్లో ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు చేపడదాం. 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు, ఆ సత్తువ ఇప్పటికీ నాకు ఉన్నాయి. సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలి. సంఖ్యాబలం ఉంది కాబట్టి మండలిలో మీరు కీలకంగా వ్యవహరించాలి’ అని చెప్పారు.  

కష్టాలు సహజం

‘అధికారంలో లేనప్పుడు కష్టాలు రావడం సహజం. ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉండే అంశం. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టగలరు. అంతకుమించి వాళ్లు ఏం చేయగలరు? మ్యానిఫెస్టోను 99% అమలుచేసి, ఇవి చేశామని ప్రజల వద్దకు వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నాకే ఎన్నికలకు వెళ్లాం. కానీ, ఎన్నికల్లో ఏమైందో తెలియదు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

అనంతబాబు హాజరు

దళిత యువకుడి హత్య, డోర్‌ డెలివరీ కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లి బెయిల్‌పై బయట ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఈ సమావేశానికి హాజరుకావడం గమనార్హం. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానం, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, వరుదు కళ్యాణి, కుంభా రవిబాబు, కల్యాణ్‌ చక్రవర్తి, మురుగుడు హనుమంతరావు, పాలవలస విక్రాంత్, మర్రి రాజశేఖర్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని