YS Jagan: పిన్నెల్లి మంచోడు...

‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు.

Updated : 05 Jul 2024 06:43 IST

అన్యాయం జరుగుతోందనే ఈవీఎంను పగలగొట్టారు
చంద్రబాబు హామీల వల్లే వైకాపా ఓడింది 
తెదేపా కార్యకర్తలపైనా చర్యలు ఉంటాయ్‌
నెల్లూరు జైల్లో పిన్నెల్లిని పరామర్శించి.. మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్‌

నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద మాట్లాడుతున్న జగన్‌. పక్కన మాజీ మంత్రులు కాకాణి, అంబటి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు

ఈనాడు, అమరావతి, నెల్లూరు, నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో అన్యాయం జరుగుతోందనే ఆయన వెళ్లి ఈవీఎంను పగలగొట్టారు’ అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ తేల్చేశారు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం జగన్‌. పరామర్శించారు. తర్వాత ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడారు. 

‘పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఎస్సీలను ఓటు వేయనివ్వడం లేదని.. అన్యాయం చేస్తున్నారని, వారికి అండగా నిలిచేందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్లారు. ఎస్పీకి ఫోన్‌ చేసినా స్పందించలేదు. అన్యాయం జరుగుతోందనే పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టారు. పిన్నెల్లికి అక్కడ అంతా బాగా ఉంటే, ఆయనే రిగ్గింగ్‌ చేసుకుంటూ ఉంటే ఈవీఎంను ఎందుకు పగలగొడతారు? ఆయనకు అక్కడ బాగోలేదు కాబట్టే పగలగొట్టారు. అక్కడ అన్యాయం జరుగుతున్నందున ఈవీఎంను ధ్వంసం చేశారని గుర్తించినందువల్లే పిన్నెల్లికి బెయిల్‌ వచ్చింది. మరోవైపు కారంపూడిలో 14న ఘటన జరిగితే 23న పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు మోపారు. ఘటన జరిగిన ప్రాంతంలో పిన్నెల్లికి సీఐ నారాయణస్వామి కనీసం ఎదురుపడలేదు..అయినా కేసు పెట్టారు. ఎన్నికల సంఘం వేసిన సిట్‌ పల్నాడులో పర్యటించి సమర్పించిన నివేదికలో ఈ హత్యాయత్నం అంశం ప్రస్తావనే లేదు’ అని వ్యాఖ్యానించారు.


నెల్లూరు కేంద్ర కారాగారంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి బయటకు వస్తున్న జగన్‌

మీ గ్రామాల్లో.. మీ కార్యకర్తలపై ఇదే తరహాలోనే

‘దొంగ కేసులు పెడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబూ ఎల్లకాలం ప్రభుత్వం మీదే ఉండదు.. ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఇలా తప్పుడు రాజకీయాలు కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పలికినట్లే. ఈ రోజు మీరు వేసే ఈ బీజం రేపు చెట్టవుతుంది.. మీ గ్రామాల్లో, మీ కార్యకర్తలకు ఇదే మాదిరి కార్యక్రమాలే జరుగుతాయి. దీనికి కచ్చితంగా ఫుల్‌స్టాప్‌ పెట్టమని చంద్రబాబును కోరడం లేదు.. హెచ్చరిస్తున్నాం. ఇదే మాదిరి జరిగితే ఊరుకునేది లేదు. ప్రతిస్పందన (రియాక్షన్‌) అనేది కచ్చితంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం’ అని జగన్‌ అన్నారు. 

అందువల్లే ఓడాం

‘ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైకాపా ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ఓడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో, కూస్తో ఇదై ఆ పదిశాతం ఓట్లు అటువైపు మారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు’ అని అన్నారు.చివరిలో విలేకరులు ప్రశ్నలు అడగబోగా తాను చదివిన స్క్రిప్టు కాగితాలు చూపిస్తూ..చాల్లే ఇది సరిపోతుంది..ఇంకెందుకు అంటూ జగన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పిన్నెల్లితో 25 నిమిషాల పాటు జగన్‌ ములాఖత్‌ 

మాజీ సీఎం జగన్‌ గురువారం మధ్యాహ్నం నెల్లూరు జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్‌ అయ్యారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో కనుపర్తిపాడులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 12.15 గంటలకు జైలులోకి వెళ్లారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. సుమారు 25 నిమిషాల పాటు పిన్నెల్లితో మాట్లాడారు. 12.40 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు బయట మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని