YS Jagan: కోర్టుకెళ్లయినా బిల్లులు తెచ్చుకుందాం: మాజీ సీఎం జగన్‌

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా) కింద అభివృద్ధి పనులు చేసిన వారు అధైర్యపడవద్దని, కోర్టుకు వెళ్లి అయినా బిల్లులు తెచ్చుకుందామని మాజీ సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.

Published : 24 Jun 2024 06:11 IST

జగన్‌తో కాంట్రాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి

పులివెందుల, (వేంపల్లె), న్యూస్‌టుడే: పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా) కింద అభివృద్ధి పనులు చేసిన వారు అధైర్యపడవద్దని, కోర్టుకు వెళ్లి అయినా బిల్లులు తెచ్చుకుందామని మాజీ సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను ఆదివారం పులివెందుల మున్సిపల్‌ ఛైర్మన్‌ వరప్రసాద్, వైస్‌ఛైర్మన్‌ మనోహర్‌రెడ్డి, ఇతర కౌన్సిలర్లు కలిసి బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు. నీరు-చెట్టు కింద పని చేసిన తెదేపా నాయకులకు రూ.250 కోట్ల మేర బిల్లులను వైకాపా ప్రభుత్వ హయాంలో చెల్లించినట్లు జగన్‌ గుర్తుచేశారు. వైకాపా పాలనలో నాలుగున్నరేళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా బిల్లులు చెల్లించామని, కాస్త ఓపిక పట్టండని సూచించారు. వైకాపా హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే కోర్టుకెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామంటూ భరోసా కల్పించారు. 

కార్యకర్తల మధ్య తోపులాట: జగన్‌ను కలిసేందుకు ఆదివారం క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులమధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. తోపులాటలో కార్యాలయ అద్దాలు పగిలి ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఎంపీ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, మాజీ ఎమ్మ్లెల్యేలు అంజాద్‌బాషా, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, సుధీర్‌రెడ్డి, రాష్ట్ర శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి జగన్‌ను కలిశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. 

భారీగా పోలీసుల భద్రత

క్యాంపు కార్యాలయానికి వైకాపా కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, కడప డీఎస్పీలు వినోద్‌కుమార్, రవికుమార్, రమాకాంత్‌ ఆధ్వర్యంలో తొమ్మిది మంది సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 130 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని