YS Jagan: ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?

ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. జగన్‌లో మార్పు రాలేదు. ప్రజాతీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు. ఓటమిని అంగీకరించక, రోజుకో మాట చెబుతూనే ఉన్నారు.

Updated : 05 Jul 2024 06:35 IST

ప్రజల్లో వ్యతిరేకతతో కాదు.. చంద్రబాబు హామీల వల్ల ఓడిపోయామంటూ జగన్‌ కొత్త పాట
దాడులు, అక్రమ కేసులను ప్రోత్సహించరాదంటూ సూక్తి ముక్తావళి
ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లి ‘మంచి’తనానికి కితాబు

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. జగన్‌లో మార్పు రాలేదు. ప్రజాతీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు. ఓటమిని అంగీకరించక, రోజుకో మాట చెబుతూనే ఉన్నారు. తన పార్టీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టడం తప్పే కాదన్నట్లు వెనకేసుకొచ్చారు. గురువారం జగన్‌ నెల్లూరులో మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఓటమిపై రెండో పాట

రెండు వారాల క్రితం ఈవీఎంల వల్ల తాము ఓడిపోయామని జగన్‌ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ బ్యాలట్‌ పత్రాలనే వాడుతున్నారంటూ గత నెల 18న ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. రెండు వారాలకే మళ్లీ స్వరం మార్చారు. ‘చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల వల్ల 10% ఓట్లు అటువైపు మారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు’ అని గురువారం కొత్తగా సెలవిచ్చారు. అంటే ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను గుర్తించడానికి సిద్ధంగా లేమనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నెల కూడా గడవకముందే... ‘ప్రభుత్వ పాపాలు పండాయి’ అనడం ద్వారా ప్రజల్లో తనపట్ల ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనకు ఇంకా తత్వం బోధపడలేదని, వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని వైకాపా వర్గీయులు తలలు పట్టుకుంటున్నారు.

ఈవీఎంను పగలగొట్టేంత మంచోడు పిన్నెల్లి

ఎమ్మెల్యేగా ఉంటూ పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి దౌర్జన్యంగా ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పరామర్శించడమే కాకుండా.. బయటకొచ్చి ఆయన ఈవీఎం పగలగొట్టడం గొప్ప పని అన్నట్లు జగన్‌ వ్యాఖ్యానించిన తీరుపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిన్నెల్లి మంచోడు కాబట్టే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటూ కితాబిచ్చేశారు. పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టేంత మంచితనం ఉన్న ఆయన ఇప్పుడు ఎందుకు ఓడిపోయారో మరి? ఆ మంచోడు, ఆయన కుటుంబం పల్నాడులో సాగించిన అరాచకాల మాటేంటి మరి? స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలవారిని కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా భయానక వాతావరణాన్ని సృష్టించి, అడ్డగోలుగా తన పార్టీకి ఏకగ్రీవాలు చేయించుకున్నదెవరు? పల్నాడును చంబల్‌లోయలా మార్చిన ఘనత ఎవరిది? ఆ ప్రాంతంలోని ప్రత్యర్థి పార్టీలవారిని తరిమికొట్టలేదా? కుటుంబాలకు కుటుంబాలు గ్రామాలను వదిలి బయటకు వస్తే.. వారికి ఆశ్రయం కల్పించేందుకు గుంటూరులో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు వైకాపా పాలనలో ఎందుకు దాపురించాయి? వీటికి జగన్‌ సమాధానాలు చెబితే బాగుండేది కదా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని