YS Jagan: పార్లమెంటులో ఎవరికైనా అంశాల వారీగా మద్దతు

‘పార్లమెంటులో ఎన్డీయే అయినా, ఇంకెవరికైనా అంశాలవారీగానే మన మద్దతు ఉంటుంది. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి’ అని వైకాపా ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ స్పష్టం చేశారు. ‘రాజ్యసభలో 11, లోక్‌సభలో 4 మొత్తంగా పార్లమెంటులో మనకు 15మంది ఎంపీలున్నారు.

Published : 15 Jun 2024 05:50 IST

వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో జగన్‌
పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘పార్లమెంటులో ఎన్డీయే అయినా, ఇంకెవరికైనా అంశాలవారీగానే మన మద్దతు ఉంటుంది. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి’ అని వైకాపా ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ స్పష్టం చేశారు. ‘రాజ్యసభలో 11, లోక్‌సభలో 4 మొత్తంగా పార్లమెంటులో మనకు 15మంది ఎంపీలున్నారు. తెదేపా ఎంపీలు 16మంది. అందువల్ల మన పార్టీ కూడా చాలా బలమైనదే. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం ధైర్యంగా ఉండి ప్రజల తరఫున పోరాడాలి’ అని చెప్పారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలనుద్దేశించి జగన్‌ మాట్లాడారు. ‘మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను. ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ముందుకెళ్లాలి. పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాల్లో చర్చించుకుని నిర్ణయాలు తీసుకోండి’ అని సూచించారు. 

శకుని పాచికల్లా ఫలితాలు

‘రాష్ట్రంలో ఎప్పుడూ, ఎవరూ చేయని మంచి పరిపాలనను గడిచిన ఐదేళ్లలో అందించాం. ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకొచ్చినా ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. శకుని పాచికల్లా ఫలితాలు వచ్చాయనిపిస్తోంది. ఏం జరిగిందో దేవుడికే తెలియాలి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మనకు 10% ఓట్లు తగ్గాయి. రాబోయే రోజుల్లో ఈ 10% ప్రజలే మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వ పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకముంది. మనలో ధైర్యం సన్నగిల్లకూడదు, పోరాటపటిమ తగ్గకూడదు. అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి నాకు ఉంది. రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికం. కచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలమనే నమ్మకం ఉంది. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి గతంలో అసెంబ్లీలో మద్దతు పలికిన తెదేపా వాళ్లే ఆ చట్టాన్ని తీసేస్తామంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

సాయిరెడ్డికి డిమోషన్‌.. ఆ సామాజికవర్గానికే పదవులు

ఇంతకాలం వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డికి డిమోషన్‌ ఇచ్చారు. ఆయన ఇకపై రాజ్యసభలో పార్టీ పక్ష నేతగానే కొనసాగుతారని జగన్‌ ప్రకటించారు. మరోవైపు ఇప్పుడు చట్టసభలో వైకాపాకు దక్కే నాలుగు కీలక హోదాల్లో ఇంతకాలం వైకాపాలో అత్యంత ప్రాధాన్యమిస్తూ వస్తున్న సామాజికవర్గానికి చెందినవారికే మళ్లీ అవకాశమిచ్చారు. ఇక్కడ శాసనసభలో వైకాపా పక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగనున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా విజయసాయి రెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలను జగన్‌ నియమించారు. తన బాబాయ్‌ అయిన వైవీని తితిదే ఛైర్మన్‌ లాంటి కీలక పదవిలో కొనసాగించిన జగన్‌.. చివర్లో ఆయన్ను రాజ్యసభకు పంపారు. ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతను చేశారు. తన అక్రమాస్తుల కేసులో ఎ-2గా ఉండడంతో పాటు.. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్రలో భూ వ్యవహారాల్లో పలు ఆరోపణలు ఎదుర్కొన్న సాయిరెడ్డికి, చిత్తూరు జిల్లాతో పాటు దిల్లీలోనూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న మిథున్‌రెడ్డికీ ఇప్పుడు మళ్లీ పదవులను కట్టబెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని