YS Sharmila: నా గతం ఇక్కడే.. భవిష్యత్తూ ఇక్కడే: వైఎస్‌ షర్మిల

తెలంగాణలో కాంట్రాక్టుల పేరుతో రూ.వేల కోట్లు దోచేస్తున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

Updated : 01 Dec 2022 15:27 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంట్రాక్టుల పేరుతో రూ.వేలకోట్లు దోచేస్తున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే తనను అరెస్ట్‌ చేశారని.. కావాలనే శాంతిభద్రతల సమస్య సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నర్సంపేట, హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు, ఇతర పరిణామాలపై రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. 

‘‘అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? ఏమీ లేని మీకు రూ.వందలకోట్లు ఎలా వచ్చాయి?ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే ధైర్యం లేదు. ఆంధ్రావాళ్లని మాట్లాడుతున్నారు.. కేటీఆర్‌ భార్య ఆంధ్రా కాదా? ఆయన భార్యను గౌరవించినపుడు నన్ను కూడా గౌరవించాలి. నేను ఇక్కడే పెరిగాను.. ఇక్కడే చదువుకున్నాను.. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను.. ఇక్కడే బిడ్డకు జన్మనిచ్చాను. నా గతం ఇక్కడే.. భవిష్యత్తూ ఇక్కడే.

నన్ను అరెస్ట్‌ చేస్తే పాదయాత్ర ఆగిపోతుందని అనుకున్నారు. దాడులు తప్పవని బెదిరిస్తున్నారు. మునుగోడు, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో తెరాస ఎంత ఖర్చు చేసిందో విచారణ జరగాలి. ఈ విషయంలో తెరాసకు చెందిన ప్రతి మంత్రి, ఎమ్మెల్యేను విచారించాలి. నా పాదయాత్ర రేపు మొదలవుతుంది. మాపై దాడులు చేసేందుకు తెరాస కార్యకర్తలు సంసిద్ధులయ్యారు. నాకు, నా మనుషులకు ఏమైనా జరిగితే పూర్తిబాధ్యత కేసీఆర్‌దే. మా శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది’’ అని షర్మిల అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని