
TS News: కొవిడ్ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా?: వైఎస్ షర్మిల
హైదరాబాద్: కొవిడ్ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా... అధికార పార్టీకి వర్తించవా? అని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. రైతు ఆవేదన యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వరంగల్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను లోటస్‌పాండ్‌కు పిలిపించారు. వారందరినీ పరామర్శించిన షర్మిల.. ఎలా చనిపోయారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన షర్మిల... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడేళ్లలో 8వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పండిన పంటను అమ్ముకోలేక కొందరు, ధరణి సమస్యలతో మరి కొందరు, అప్పులతో ఇంకొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక్కడ ఇంతమంది చనిపోతే పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎక్కడో హర్యానాలో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తారంట అని ఎద్దేవా చేశారు. ర్యాలీ, సభలు, సమావేశాలు నిషేధిస్తూ గత నెల 25న జీవో ఇచ్చినా.. అధికార పార్టీ నల్గొండ జిల్లాలో ర్యాలీ, సభలు ఎలా పెడతారని షర్మిల నిలదీశారు.