YS Sharmila: వైఎస్‌ షర్మిల ఆమరణ దీక్ష భగ్నం

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అరెస్టు చేసి బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించారు. 

Updated : 11 Dec 2022 08:55 IST

ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే: గత రెండు రోజులుగా హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ వైతెపా కార్యాలయంలో  ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పాదయాత్రకు అనుమతి వచ్చేవరకు దీక్షను విరమించేది లేదని, షర్మిల ఆమరణ దీక్ష చేస్తున్న విషయం విదితమే. ఆమె ఆరోగ్యం విషమిస్తుండటంతో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పోలీసులు  లోటస్‌పాండ్‌కు చేరుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆమెను వైద్యం నిమిత్తం జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం షర్మిల తల్లి విజయమ్మ ఆస్పత్రికి చేరుకున్నారు.

అంతకుముందు షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేస్తున్నారని విమర్శించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని సీఎం ఖూనీ చేస్తున్నారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. మా నాయకులను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు శనివారం సాయంత్రానికి కూడా విడుదల చేయలేదు. పాత కేసులు తవ్వి రిమాండ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టి సామాన్యులను కూడా రానివ్వడం లేదు. పాదయాత్రలో ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.

పాదయాత్రలో ఎక్కడా వ్యక్తిగత దూషణలు చేయలేదు. అధికార పార్టీ నాయకులే దూషించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ ఏనాడూ మహిళల గురించి నోరు విప్పలేదు. నన్ను దూషించారు. దీన్ని ఆమె విచక్షణకే వదిలేస్తున్నా. 3,500 కిలోమీటర్ల పాదయాత్రలో ఒక్కసారి కూడా నిబంధనలను ఉల్లంఘించలేదు. మా పార్టీ కార్యాలయం చుట్టూ కర్ఫ్యూ ఎత్తివేసి.. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేసేదాకా దీక్షను ఆపేది లేదు’’ అని షర్మిల స్పష్టంచేశారు. ఆమెకు మద్దతుగా తల్లి వైఎస్‌ విజయలక్ష్మి దీక్షలో పాల్గొన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు సుధీకర్‌రెడ్డి, వివేకానందరెడ్డి కుమార్తె సునీత పరామర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని