YS Sharmila: ధ్వంసమైన కారులోనే షర్మిల నిరసన.. క్రేన్‌తో లిఫ్ట్‌ చేసి తరలించిన పోలీసులు

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్‌ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్‌ వాహనంతో లిఫ్ట్‌ చేసి తరలించారు. 

Updated : 29 Nov 2022 14:55 IST

హైదరాబాద్: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్‌ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్‌ వాహనంతో లిఫ్ట్‌ చేసి తరలించారు. పోలీసుల వైఖరిపై వైతెపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు వైతెపా కార్యకర్తల ఆందోళనతో రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించింది.

షర్మిల ఇటీవల వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించారు. ఈ క్రమంలో తెరాసకు చెందిన స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌పై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ షర్మిల పాదయాత్రను తెరాస కార్యకర్తలు సోమవారం అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని.. పాదయాత్రను నిలిపివేయాలని షర్మిలను నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు కోరగా ఆమె నిరాకరించారు. ఈ క్రమంలో శంకరాం తండా సమీపంలో నిలిపిన షర్మిల కారవాన్‌పై కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. పక్కనే ఉన్న ఇన్నోవా వాహనం అద్దాలనూ పగలగొట్టారు. అనంతరం షర్మిలను హైదరాబాద్‌ తరలించారు.

సోమవారం జరిగిన పరిణామాలకు నిరసనగా షర్మిల నేడు ప్రగతిభవన్‌కు బయల్దేరారు. నర్సంపేటలో ధ్వంసం చేసిన కారులో స్వయంగా డ్రైవ్‌ చేసుకుని నిరసనకు వెళ్తుండగా పంజాగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వాహనం దిగాలని పోలీసులు కోరినప్పటికీ ఆమె వినలేదు. దీంతో ధ్వంసమైన కారు డ్రైవింగ్‌ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే పోలీసుల క్రేన్‌ను తెప్పించి అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని