YS Sharmila: తెరాస కార్యకర్తలను అరెస్టు చేయాల్సిందే.. జోరువానలో షర్మిల దీక్ష

తెరాస వైఖరికి వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ మండలం లక్కవరంలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరసన దీక్షకు దిగారు.

Updated : 06 Jul 2022 00:42 IST

హుజూర్‌నగర్‌: తెరాస వైఖరికి వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ మండలం లక్కవరంలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరసన దీక్షకు దిగారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 31వ వారం లక్కవరంలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. అందుకు పోటీగా తెరాస శ్రేణలు నిరసనకు దిగాయి. ఈక్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వైకాపా నాయకుడు ఏపూరి సోమన్నపై దాడి చేసిన తెరాస కార్యకర్తలను అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు. తెరాస కార్యర్తలను అరెస్టు చేసే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేస్తూ వైఎస్సార్‌ విగ్రహం వద్ద జోరువానలో దీక్ష కొనసాగించారు. దీక్ష విరమించాలని పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె పట్టించుకోకుండా దీక్ష కొనసాగించారు. పోలీసులపై నమ్మకం లేదని, మా ముందే వారిని అరెస్టు చేయాలని దీక్ష కొనసాగించారు. చివరికి డీఎస్పీ హామీతో షర్మిల దీక్ష విరమించారు.  

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘ఇవాళ ఉదయం నుంచే తెరాస కార్యకర్తలు.. సోమన్నపై రెక్కీ నిర్వహించారు. పోలీసులకు చెప్పినా వాళ్లేం చేయలేకపోయారు. తెరాస కార్యకర్తలను అదుపులోకి తీసుకోవాలని ఉదయం నుంచి చెప్పినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సోమన్నపై దాడి చేసిన వారిని తాము గుర్తించి చెప్పినప్పటికీ చూసీచూడనట్లు వదిలేశారు. దాడి చేసిన వారిని మఠంపల్లి ఎస్సై రవి దగ్గర ఉండి మరీ ఇక్కడి నుంచి పంపించేశారు. ఈ దాడికి సూత్రదారి మఠంపల్లి మండల తెరాస అధ్యక్షుడు. అతన్ని ఇంతవరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు. దాడి చేసిన వారిని అరెస్టు చేసేంత వరకు ఈ గ్రామం నుంచి కదలను. పోలీసులు తెరాస నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. గులాబీ కండువా కప్పుకోండి’’ అంటూ షర్మిల మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని