
Ys sharmila: తెలంగాణ ఉద్యమంలో పోరాడింది ఎస్సీలే: షర్మిల
సూర్యాపేట: తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది ఎస్సీలేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన దళితభేరి సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో దాదాపు 400 మంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారు. ఆట పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది వారే. వైఎస్‌ఆర్ పాలనలో ముగ్గురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఎస్సీ ఐఏఎస్‌లను కేసీఆర్ అవమానించారు. కేసీఆర్ చేసిన అవమానాలతో ఐఏఎస్‌లు ముందే రిటైర్ అయ్యారు. కేసీఆర్ సలహాదారుల్లో ఒక్క దళిత వ్యక్తి కూడా లేరు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు.. కానీ, చివరకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తారా? లేదా చెప్పాలి. ప్రతి రోజూ దళితులపై దాడులు జరుగుతున్నాయి. కేసీఆర్ పాలనలో ఎస్సీలపై దాడులు 800 శాతం పెరిగాయి. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితులకు రూ.10లక్షలు ఇస్తున్నారు. ఏడేళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయలేదు. అడ్డగూడూరు పీఎస్‌లో ఎస్సీ మహిళను లాకప్‌డెత్ చేస్తే చర్యలేవి. దళితుల కోసం కేటాయిస్తున్న డబ్బులు ఎవరి చేతుల్లోకి పోతున్నాయి’’ అని షర్మిల ప్రశ్నించారు.