YS Sharmila: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని ఆపడం ఎవరి తరం కాదు: వైఎస్‌ షర్మిల

ఎవరెన్ని దాడులు చేసినా.. కొట్టినా.. చంపినా ఎట్టిపరిస్థితుల్లో బెదిరేది లేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తేల్చి చెప్పారు. పాదయాత్రను తిరిగి ఈ నెల 4 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

Updated : 02 Dec 2022 18:44 IST

హైదరాబాద్: ఎవరెన్ని దాడులు చేసినా.. కొట్టినా.. చంపినా ఎట్టిపరిస్థితుల్లో బెదిరేది లేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తేల్చి చెప్పారు. 
హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, తెరాస వ్యవహారశైలి, పోలీసు నిర్బంధాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల బెదింపులు, పాదయాత్ర కొనసాగింపుపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఆమె సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్న షర్మిల.. పాదయాత్రను తిరిగి ఈ నెల 4 నుంచి మొదలుపెట్టి 14వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని షర్మిల తెలిపారు. ఆపద సమయంలో తనతో ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని.. వారంతా తన కుటుంబమని అన్నారు.

సమావేశం అనంతరం పార్టీ నేతలతో కలిసి అదనపు డీజీ జితేందర్‌ను షర్మిల కలిశారు. పాదయాత్రకు సంబంధించిన వివరాలను అదనపు డీజీకి వివరించారు. పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు. పాదయాత్రను కొనసాగించాలని కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ కాపీని సైతం పోలీసులకు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర సాగిస్తాం. ఆగిన చోటు నుంచే పాదయాత్రను కొనసాగిస్తాం. ఇప్పటివరకు 3,525 కి.మీ. మేర పాదయాత్రను పూర్తి చేశాం. 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగిస్తాం. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జరిగిన పరిణామాలను తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. తెరాసలో ఒకప్పుడు ఉన్న ఉద్యమకారులను పార్టీ నుంచి కావాలని వెళ్లగొట్టారు. ఇప్పుడు గూండాల మాదిరిగా వ్యవహరిస్తోన్న తెరాస నేతలు, కార్యకర్తల తీరును రాష్ట్ర ప్రజలు గమనించాలి. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పాదయాత్రనే కాదు.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని ఆపడం ఎవరి తరం కాదు’’ అని షర్మిల అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని