Casino: క్యాసినో వ్యవహారం.. ఈడీ ముందుకు వైకాపా మాజీ ఎమ్మెల్యే

క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట అనంతపురానికి చెందిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి హాజరయ్యారు.

Updated : 17 Nov 2022 12:18 IST

హైదరాబాద్‌: క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట అనంతపురానికి చెందిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడంతో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. క్యాసినోల వ్యవహారంలో గుర్నాథరెడ్డి పాత్రపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.

క్యాసినోల ముసుగులో విదేశాలకు నిధుల మళ్లిస్తున్నారన్న ఆరోపణలపై నాలుగు నెలల క్రితం ఈడీ నమోదు చేసిన కేసు మరోమారు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి జూద ప్రియులను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తీసుకెళుతూ పెద్దమొత్తంలో నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పలువురు టూర్‌ ఆపరేటర్లపై గత జులైలో ఈడీ కేసు నమోదు చేసి పలువురిని విచారించింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో సోదాలు నిర్వహించి వారిని విచారించారు.

ఆ తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఈ కేసు ఇప్పుడు మరోమారు తెరపైకి వచ్చింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సోదరులు మహేష్‌యాదవ్‌, ధర్మేందర్‌ యాదవ్‌లను హైదరాబాద్‌ ఈడీ అధికారులు బుధవారం తమ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. వీరితోపాటు అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్‌ డీసీసీబీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని