Kolusu Parthasarathy: వైకాపా ప్రభుత్వం ఒక్క ఇంటినీ నిర్మించలేదు

పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామన్న వైకాపా ప్రభుత్వ పాలకులు ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

Published : 20 Jun 2024 04:49 IST

కేంద్రం 20.6 లక్షలు మంజూరుచేస్తే, పూర్తిచేసింది 6.8 లక్షలే
నిధులనూ దారిమళ్లించారు: మంత్రి కొలుసు పార్థసారథి

ఈనాడు, అమరావతి: పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామన్న వైకాపా ప్రభుత్వ పాలకులు ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అయిదేళ్లలో కేంద్రం 20.6 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే, అందులో 6.8 లక్షలు మాత్రమే పూర్తిచేశారని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వ నిధులతో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని మండిపడ్డారు. ఆయన బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘2014-19లోని తెదేపా ప్రభుత్వ హయాంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు చెల్లిస్తుండగా, వైకాపా ప్రభుత్వం వచ్చాక రూ.1.80 లక్షలకు తగ్గించేసింది. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాంతంలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పురపాలికల పరిధిలో రూ.30 వేలు మాత్రమే ఇచ్చారు. అదే 2014-19లో రాష్ట్రప్రభుత్వ వాటాగా రూ.లక్ష చొప్పున ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఇచ్చారు. తెదేపా హయాంలో రాష్ట్ర నిధులతో 4.43 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చారు. అయితే అందులో సగం ఇళ్లకు రూ.937 కోట్ల బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం పేదలకు అన్యాయం చేసింది. కేంద్రం ఇళ్ల నిర్మాణ కోసం రూ.18,173 కోట్లు ఇస్తే.. అందులో రూ.3,170 కోట్లు గృహ నిర్మాణశాఖకు ఇవ్వకుండా దారిమళ్లించింది. వాటిని రుషికొండ రాజభవనానికో, కావాల్సిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకో వినియోగించి ఉండొచ్చు. పెండింగ్‌లో ఉన్న 13.8 లక్షల ఇళ్లను పూర్తిచేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. ‘గతంలో చంద్రబాబు ప్రభుత్వం పురపాలికలకు సమీపంలో భూసేకరణ చేసి టిడ్కో ఇళ్లను నిర్మించింది. వైకాపా ప్రభుత్వం మాత్రం నివాసయోగంలేని ప్రాంతాల్లో, ఊరికి 10-15 కి.మీ. దూరంగా భూసేకరణ చేసింది. రాజమహేంద్రవరం వద్ద 850 ఎకరాల ఆవభూముల సేకరణ, అనేకచోట్ల అధిక ధరలతో ఎమ్మెల్యేలు భూసేకరణ జరిపారనేదానిపై విచారణ జరిపి, సీఎంతో చర్చించి చర్యలు తీసుకుంటాం. జగనన్న కాలనీల పేర్ల మార్పుపై పరిశీలిస్తాం. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై కోర్టులో కేసులు ఉన్నందున, వాటిపై సమీక్ష జరిపి, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లి, అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’ అని పార్థసారథి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని