Andhra News: తాడిపత్రిలో విలేకరులను చితకబాదిన వైకాపా నేతలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నేతలు వీరంగం సృష్టించారు. పోలీసుల ఎదుటే మీడియా ప్రతినిధులను చితకబాదారు. స్థానికంగా ఉన్న మురుగునీటి పైపులైను మరమ్మతుల విషయంలో

Updated : 11 Jun 2022 11:57 IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నేతలు వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులను చితకబాదారు. స్థానికంగా ఉన్న మురుగునీటి పైపులైను మరమ్మతుల విషయంలో తెదేపా, వైకాపా నేతలు పోటీపడ్డారు. అదే సమయంలో ఈ ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరులపై వైకాపా నేతలు దాడి చేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా ఒక మీడియా ప్రతినిధి ఫోన్‌ లాక్కొని వెళ్లారు. తెదేపా కౌన్సిలర్‌ మల్లికార్జున, కాంట్రాక్టర్‌ మల్లికార్జునరెడ్డిపైనా వైకాపా నేతలు దాడి చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ‘‘తాడిపత్రి పట్టణం నుంచి వెళ్లే భూగర్భ డ్రైనేజీ పైపులైన్‌ ఒకటి మరమ్మతులకు గురైంది. దీనికి దాదాపు రూ.2లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మున్సిపాలిటీ వారు ఈ ఖర్చును భరించడం కష్టమని నిర్ణయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన సొంత ఖర్చుతో ఆ పైపులైన్‌ మరమ్మతులు చేయాలని అనుకున్నారు. ఈ పనిని మల్లికార్జున్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే ఈ పనిని ప్రభాకర్‌రెడ్డి చేయించడం ఏంటని వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు కేతిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హర్షవర్దన్‌రెడ్డి 31వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో హర్షవర్దన్‌రెడ్డి తన బలగంతో మరమ్మతులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈ పనులు మీరేంటి చేసేది.. మేం చేస్తాం.. అని పోటీకి దిగారు. దీంతో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ మొత్తం సంఘటనను చిత్రీకరిస్తున్న విలేకరులపై మొదటగా హర్షవర్దన్‌రెడ్డి దాడికి దిగారు. ఆ తర్వాత వైకాపా నాయకులు అంతా వచ్చి కాంట్రాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, విలేకరులు, తెదేపా కౌన్సిలర్‌పై మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు. ఈ ఘటనలో కౌన్సిలర్‌ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. ఒక విలేకరికి చెవి పూర్తిగా దెబ్బతిందని.. వినికిడి శక్తి కోల్పోయినట్లు తాడిపత్రి వైద్యులు ధ్రువీకరించారు. మెరుగైన వైద్యం కోసం ఈ ముగ్గురిని అనంతపురం ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని