YSRCP: ప్రజావేదిక కూల్చివేతపై అప్పట్లో వైకాపా నీతులు

ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వానికి చెందిన ప్రజావేదికను కూల్చేశారు. ఆ సందర్భంలో ‘‘అక్రమ కట్టడాన్ని కూలిస్తే తెదేపా నేతలు ఎందుకు పెడబొబ్బలు పెడుతున్నారు?’’ అంటూ వైకాపా నాయకులు మాట్లాడారు.

Published : 24 Jun 2024 04:25 IST

ఇప్పుడు అక్రమంగా నిర్మిస్తున్న ఆ పార్టీ భవనాన్ని కూల్చేస్తే పెడబొబ్బలు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వానికి చెందిన ప్రజావేదికను కూల్చేశారు. ఆ సందర్భంలో ‘‘అక్రమ కట్టడాన్ని కూలిస్తే తెదేపా నేతలు ఎందుకు పెడబొబ్బలు పెడుతున్నారు?’’ అంటూ వైకాపా నాయకులు మాట్లాడారు. ఇప్పుడు నిబంధనల్ని ఉల్లంఘించి, చట్టాల్ని కాలరాస్తూ, ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని మున్సిపల్‌ అధికారులు నేలమట్టం చేస్తే.. అది అన్యాయమంటూ అదే వైకాపా నాయకులు గొంతు చించుకుంటున్నారు. దీంతో అప్పట్లో ప్రజావేదిక కూల్చివేతపై వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు అందరూ గుర్తుచేసుకుంటున్నారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 


అఘాయిత్యం జరిగినట్లు పెడబొబ్బలు ఏంటి?

-పేర్ని నాని, నాటి జగన్‌ ప్రభుత్వంలో మంత్రి

చట్టాన్ని తుంగలో తొక్కి అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చేస్తే జగన్‌మోహన్‌రెడ్డిని అభినందించాల్సింది పోయి తెదేపా నేతలు ఏడుపులు, పెడబొబ్బలు పెట్టడం ఏంటి? తుపాను, వరద బాధితుల మాదిరిగా ఎందుకు గగ్గోలు పెడుతున్నారు. సామాన్య పౌరుడైనా, ముఖ్యమంత్రి అయినా ఎవరికయినా చట్టం ఒకేలా వర్తించాలనే ఉద్దేశంతోనే ప్రజావేదిక కూల్చివేతకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. ప్రజావేదిక ఒక్కటే కాదు.. రాష్ట్రంలోని అక్రమ కట్టడాలన్నింటిపైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. 


 మనమే చట్టాల్ని పాటించకపోతే ఎలా?

-బుగ్గన రాజేంద్రనాథరెడ్డి,  నాటి జగన్‌ ప్రభుత్వంలో మంత్రి

నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించిన ప్రజావేదికను కూల్చేస్తే తప్పేంటి? దాన్ని ఎలాంటి అనుమతులూ లేకుండా కట్టారు. చట్టాలు, నిబంధనలు రూపొందించే మనమే వాటిని పాటించకపోతే ఇతరులకు చెప్పే నైతికత మనకు ఎక్కడ ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రజావేదిక కూల్చివేతకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దాన్ని అనవసరంగా పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. 


అక్రమంగా నిర్మించారు.. అందుకే కూల్చివేతకు ఆదేశం

- బొత్స సత్యనారాయణ, నాటి జగన్‌ ప్రభుత్వంలో మంత్రి

ప్రజావేదికను చట్ట వ్యతిరేకంగా కట్టారు. ఆ కట్టడం అక్కడ ఉండటానికి వీల్లేదు. దాన్ని అక్రమంగా నిర్మించారు. అందుకే కూల్చివేయాలని సీఎం ఆదేశించారు.


సీఎం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం

- అనిల్‌కుమార్‌ యాదవ్, నాటి జగన్‌ ప్రభుత్వంలో మంత్రి

ప్రభుత్వ సొత్తుతో అక్రమంగా కట్టిన ప్రజావేదిక భవనాన్ని కూల్చేస్తే అది తప్పెలా అవుతుంది? అక్రమ కట్టడాన్ని తొలగించాలని చెప్పడం మా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనం.


ఎవరైనా చట్టాన్ని గౌరవించాలి

-ఆళ్ల రామకృష్ణారెడ్డి, నాటి మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే

నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి ప్రజావేదిక కట్టారు. ఎన్జీటీ తీర్పులను లెక్క చేయలేదు. ఎవరైనా చట్టాన్ని గౌరవించాలి. న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. అక్రమ నిర్మాణం కాబట్టే దాని కూల్చివేతకు సీఎం ఆదేశాలిచ్చారు. 


ప్రజావేదిక కూల్చివేతను సమర్థిస్తున్నా

-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైకాపా సీనియర్‌ నేత

ప్రజావేదిక కూల్చివేతను కచ్చితంగా సమర్థిస్తున్నాం. ఇది అక్రమ కట్టడమని నేనే శాసనమండలిలో తొలుత ప్రస్తావించాను. ప్రజాధనంతో అక్రమ నిర్మాణం చేపట్టి దాన్ని సక్రమం చేయించుకునేందుకు ప్రయత్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని