Raghurama: ‘నారాయణ అరెస్ట్‌ న్యాయమైతే.. జగన్‌, బొత్సనూ అరెస్ట్‌ చేయాలి’

 తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండిస్తున్నట్లు నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ తెలిపారు. 

Updated : 10 May 2022 15:24 IST

దిల్లీ: తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండిస్తున్నట్లు నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ తెలిపారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో 36 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం ఇటీవల చెప్పిందన్నారు. దీనికి సంబంధించి నారాయణ అరెస్టు న్యాయం అనుకుంటే.. సీఎం జగన్‌, విద్యాశాఖ మంత్రి బొత్సనూ అరెస్టు చేయాలి కదా?అని రఘురామ ప్రశ్నించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘ఇటీవల తిరుపతిలో సీఎం జగన్‌.. నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల నుంచే పదో తరగతి ప్రశ్నప్రతాలు లీక్‌ అయ్యాయని అన్నారు. అన్యాయంగా తమపై అపవాదులు వేస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత రోజు అదంతా అబద్ధమని బొత్స తెలిపారు. ఇందులో ఏది నిజం? నారాయణను అరెస్టు చేయడం తప్పు. వీరికొక అలవాటు ఉంది. విచారణ చేసే గదుల్లో కెమెరాలు తీసేస్తారు. వ్యక్తిగత సిబ్బంది ఉంటే పంపించేస్తారు. కేవలం కొట్టడం కోసమే తీసుకెళ్తారు. ఆ తర్వాత పచ్చి అబద్ధాలు ఆడతారు. ఇవన్నీ నా కేసు విచారణలో అసలు దొంగలు, క్రూర మృగాలతో సహా బయటికొస్తారు. దెబ్బతిన్న వ్యక్తిగా ఇదంతా చెబుతున్నా.

నారాయణను అభిమానించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఆయన ఎంత ఫిజికల్‌ ఫిట్‌గా ఉన్నారో తెలియదు. రెండు మూడు దెబ్బలు కొడితే ఏదైనా జరగొచ్చు. దయచేసి వెంటనే కోర్టును ఆశ్రయించండి. ఈ ప్రభుత్వాధినేతలు ఎంతకైనా తెగిస్తారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారు నారాయణ అరెస్ట్‌ను ఖండించాలి. ప్రభుత్వ అన్యాయాలపై ప్రశ్నించడానికి ఇప్పుడిప్పుడే నాయకులు, వారిని చూసి ప్రజలు బయటికొస్తున్నారు. ఓ సీనియర్‌ నేతను అరెస్ట్‌ చేస్తే వీళ్లంతా భయపడతారని అనుకుంటున్నారు’’ అని రఘురామ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని