Andhra News: దారికొస్తున్న ఎమ్మెల్యేలు... రాజీనామా కాదు థ్యాంక్స్‌ చెబుతూ లేఖ రాశా: సుచరిత

మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైకాపా ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, సామినేని

Updated : 13 Apr 2022 18:38 IST

అమరావతి: మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైకాపా ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభానులను బుజ్జగించిన సీఎం జగన్‌ ఇవాళ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, పలువురు ఎమ్మెల్యేలను బుజ్జగించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుచరిత సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన ఆవేదనను సీఎం వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గం మొత్తాన్ని మార్చేస్తానని చెప్పి... 11 మందిని తిరిగి కొనసాగించి తనను పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురయ్యానని  సీఎంతో చెప్పినట్టు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను కొనసాగించి తనను మాత్రమే తొలగించడం బాధ కలిగించిందన్నారు. మంత్రి పదవి ఇవ్వలేకపోవడానికి గల కారణాలను సీఎం వివరించినట్టు తెలిసింది. జిల్లా అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి కేబినెట్‌ ర్యాంకుతో సమానంగా ఉండే హోదా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం.

అయితే, ఇప్పటికే సుచరిత అసంతృప్తికి లోనై, అనుచరులు ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామాపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సీనియర్‌ నేతలు మాట్లాడుతున్నప్పటికీ రాజీనామా చేసి కొంత ఇబ్బందికర పరిస్థితులు కల్పించారంటూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. తన రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సుచరిత సిద్ధమైనట్టు తెలుస్తోంది. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. కాపు రామచంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాయదుర్గంలో వైకాపా శ్రేణులు బంద్‌ నిర్వహించగా, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఈ నేపథ్యంలో.. భవిష్యత్‌లో మంత్రి పదవి ఇచ్చే అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తానని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కూడా సీఎంను కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో తప్పకుండా న్యాయం చేస్తానని, పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం.

జగన్‌కు విధేయురాలిగానే ఉంటా: సుచరిత

సీఎం జగన్‌తో భేటీ అనంతరం మాజీ మంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2006లో రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చా. జడ్పీటీసీ నుంచి హోం మంత్రి స్థాయి వరకు ఎదిగానంటే అది సీఎం జగన్‌ కల్పించిన అవకాశమే. అనారోగ్యం కారణంగా నెల రోజులుగా బయటకు రాలేకపోయాను. రెండున్నరేళ్ల తర్వాత కొంతమందిని మారుస్తానని సీఎం ముందుగానే చెప్పారు. కొంతమందిని మార్చాల్సి వస్తుందని గత కేబినెట్‌ సమావేశంలోనే ప్రకటించారు. కొత్త మందికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు. అనారోగ్య, వ్యక్తిగత కారణాలతో కేబినెట్‌లో కొనసాగలేనేమోనని థ్యాంక్స్‌ చెబుతూ లేఖ రాస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రకరకాలుగా వార్తలొచ్చాయి. పదవి ఆశించి రాకపోవడంతో చిన్న ఎమోషన్‌కు గురయ్యా.. దయచేసి ఇంతటితో ఆపేయాలని కోరుతున్నా. సీఎం జగన్‌ కుటుంబ సభ్యురాలిగా ఎప్పుడైనా ఆయన్ను కలిసే అవకాశం నాకు ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నంతకాలం నేను వైకాపాలోనే కొనసాగుతా, వేరే వైపు చూడాల్సిన అవసరం, అగత్యం నాకు లేదు. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తే వైకాపా ఓటరుగానే ఉంటాను. ఎప్పటికీ సీఎం జగన్‌ విధేయురాలిగానే ఉంటా’’ అని సుచరిత తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని