జగన్‌ పాలనను చూసి ఓటేశారు: విజయసాయిరెడ్డి

ఏపీలో జరిగిన పుర, నగరపాలక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడం పట్ల ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. మద్దిలపాలెంలోని వైకాపా నగర కార్యాలయంలో మంత్రులు

Published : 15 Mar 2021 01:21 IST

విశాఖపట్నం: ఏపీలో జరిగిన పుర, నగరపాలక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడం పట్ల ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. మద్దిలపాలెంలోని వైకాపా నగర కార్యాలయంలో మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. పురపాలిక ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం ఐదు కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పుగా పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతు పలికారన్నారు. సీఎం జగన్‌ ప్రచారం చేయనప్పటకీ ఆయన పాలనను చూసి ప్రజలు ఓటేశారన్నారు. 

ఏకగ్రీవాలను ఒప్పుకోబోమని చంద్రబాబు అన్నారని, మరి ఈ ఫలితాలు ఏం చెబుతున్నాయన్నది విశ్లేషించుకోవాలని హితవుపలికారు. ఏకగ్రీవాలు కాని చోట ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో ఫలితాలు చూశాక కొంత అసంతృప్తి కలిగిందన్నారు. గాజువాక, భీమిలి, పెందుర్తి, విశాఖ దక్షిణంలో చాలా వార్డులను కోల్పోయామని, ఇది అనుకోని పరిణామమన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కారణాలు విశ్లేషించుకొని, నాయకులతో చర్చించి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా సరిదిద్దుకుంటామన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో వైకాపా గెలుపొందడానికి కృషిచేసిన కార్యకర్తలను, నాయకులను విజయసాయిరెడ్డి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని