YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని

గన్నవరం నియోజకవర్గ వైకాపాలో గత కొంత కాలంగా వర్గపోరు కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు

Updated : 30 Jun 2022 21:07 IST

యార్లగడ్డ, దుట్టా వర్గీయుల్లో కలవరం

విజయవాడ: గన్నవరం నియోజకవర్గ వైకాపాలో గత కొంత కాలంగా వర్గపోరు కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. 2024లో తానే గన్నవరం నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్రావు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ గన్నవరంలో జరిగిన వైకాపా ప్లీనరీలో మాజీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో కలవరం మొదలైంది. ‘‘2024లో గన్నవరం నుంచి వైకాపా అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తారు. నేతల మధ్య విభేదాలు ఉంటే పిలిచి మాట్లాడతానని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. అందరూ కలిసి పనిచేయాలి’’ అని కొడాలి నాని ప్రకటించారు. దీంతో యార్లగడ్డ, దుట్టా వర్గీయుల్లో కలవరం మొదలైంది.

అయితే, గన్నవరం నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్‌ తెదేపా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన వైఎస్‌ జగన్‌కు మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఇక్కడ నుంచి గన్నవరం అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభమైంది. 2019లో వంశీపై వైకాపా నుంచి పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు సుమారు 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అంతకుముందు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న దుట్టా రామచంద్రరావుకు ఎమ్మెల్సీ ఇస్తానని అధినేత జగన్‌ హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. యార్లగడ్డ ఓడిన తర్వాత డీసీసీబీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు జరిగాయి. రూ.కోట్లలో ఆదాయానికి గండికొట్టారు. 

ఇదే అంశంపై అధికార పార్టీ నేతలు పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ వంశీ వర్గం, వ్యతిరేక వర్గంగా తయారయ్యారు. తెదేపా నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, వైకాపా కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ దుట్టా, యార్లగడ్డ అనుచరులు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఇప్పటికే మూడుసార్లు సీఎం వద్ద పంచాయితీ జరిగింది. అక్రమ మట్టి తవ్వకాలపై ఇటీవల మీడియా సమావేశంలో వైకాపా నేతల నోటి వెంట ఘాటైన పదజాలాలు వెలువడ్డాయి. ఆత్కూరులో ఒక కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వంశీ, హనుమాన్‌ జంక్షన్‌లో.. తన నివాసంలో దుట్టా రామచంద్రరావు, అల్లుడు శివభరత్‌రెడ్డి.. విజయవాడలో తన నివాసంలో యార్లగడ్డ వెంకట్రావు ముగ్గురు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా సీరియస్‌ అయినట్లు తెలిసింది. తాజాగా కొడాలి నాని చేసిన ఈ ప్రకటనపై యార్లగడ్డ, దుట్టా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. అయితే, ఇవాళ జరిగిన వైకాపా గన్నవరం నియోజకవర్గ ప్లీనరీ కార్యక్రమానికి వల్లభనేని వంశీ హాజరు కాలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని