YSRCP: రిసార్ట్స్‌ భవనాల్లో ఫొటోలు తీసి పైత్యం ప్రదర్శించడమా: వైకాపా

‘‘రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే.. అవి ప్రైవేటు ఆస్తులు కావు. ఎవరి సొంతం కూడా కావు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భవనాల్ని నిర్మించారు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం.

Published : 17 Jun 2024 06:41 IST

ఈనాడు, అమరావతి: ‘‘రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే.. అవి ప్రైవేటు ఆస్తులు కావు. ఎవరి సొంతం కూడా కావు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భవనాల్ని నిర్మించారు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకివెళ్లి ఫొటోలు తీయించి.. వాటికి వక్రీకరణలు జోడించి.. బురద జల్లాలని ప్రయత్నించడం వెనక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్‌ లాంటి వ్యక్తులు విశాఖకు వెళ్తే.. వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో గానీ, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు..’’ అని వైకాపా ట్వీట్‌ చేసింది.


అవసరం లేని భవనం కట్టిన మీదే పైత్యం.. మాది పారదర్శకత 

‘ప్రజల డబ్బుతో కట్టిన భవనాన్ని ప్రజలకు చూపించిన మాది పైత్యం కాదు.. పారదర్శకత’ అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘ఎక్స్‌’ వేదికగా వైకాపా ఆదివారం చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. ‘విశాఖపట్నానికి చాలాసార్లు రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు వచ్చినా వారి హోదాకు తగ్గకుండా విడిది ఏర్పాట్లు జరిగాయి. వారి కోసమే రుషికొండ భవన నిర్మాణమని దిగజారుడుతనంతో వ్యవహరిస్తున్నారు. వందల కోట్ల జనం సొమ్ముతో అవసరం లేని భవనం కట్టిన మీది పైత్యం’ అని ధ్వజమెత్తారు. ‘విశాఖపట్నంలో అత్యవసరంగా చేయాల్సిన ప్రజాసమస్యల్ని గాలికొదిలేసి.. యుద్ధప్రాతిపదికన రుషికొండ భవనాన్ని నిర్మించడమే ఈ ఐదేళ్లలో విశాఖకు మీరు చేసిన ఘనకార్యంగా భావించాలా? ఆ డబ్బుతో పేదలకు పనికొచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని