YSRCP: నలుగురు వైకాపా ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

నలుగురు ఎమ్మెల్యేలపై వైకాపా చర్యలకు దిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న కారణంతో వారిని సస్పెండ్‌ చేసింది.

Updated : 24 Mar 2023 18:43 IST

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడ్డారన్న కారణంతో నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైకాపా చర్యలకు దిగింది. ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi)లను సస్పెండ్‌ చేసినట్లు వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ప్రకటించారు. ఈ మేరకు వైకాపా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 నుంచి రూ.15 కోట్లు ఇచ్చి చంద్రబాబు కొనుగోలు చేశారని సజ్జల ఆరోపించారు.

‘‘ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా నష్టమే. రోగ కారణాన్ని తక్షణం గుర్తించి ఇలాంటి వాటిని తొందరగా తొలగించుకోవాలి. అందుకే మా పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నారు. విశ్వాసం లేనప్పుడు పార్టీలో ఉంచడం అనవసరం. అందుకే వారితో అవసరం లేదని తొలగించాం. ఆ నలుగురూ క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని  పార్టీ నమ్మింది కాబట్టే సస్పెండ్‌ చేశాము. కేవలం అసంతృప్తి వల్ల ఎవరూ బయటకు వెళ్లిపోరు. ప్రలోభాలకు గురిచేస్తేనే వారు క్రాస్‌ ఓటింగ్‌ చేశారు. కానీ, తెదేపా నుంచి వచ్చిన వాళ్లు మాపై అభిమానంతో వచ్చారు. వాళ్లు తెదేపా నుంచి బయటకు రావడానికి పార్టీలో అసంతృప్తే కారణం’’ అని  సజ్జల అన్నారు.

చాలా రిలాక్స్‌గా ఉన్నా: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

తనను సస్పెండ్‌ చేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సస్పెండ్‌ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ‘‘వైకాపా నిర్ణయంతో చాలా రిలాక్స్‌గా ఉన్నాను. మంచి చేసిన వారికే చెడు చేసే ఆలోచనలు కొందరికి ఉంటాయి. అందులో వైకాపా అగ్రనేతలు కొందరు ముందుంటారు. మేం శక్తి హీనులమైనందునే వాళ్లకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతు ప్రకటించి, ఇన్నాళ్లు ఆయన వెంట నడిచినందుకు ఘనంగా సత్కరించారు’’ అని మేకపాటి అన్నారు.

గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్‌ వెంటనడిస్తే.. ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే పదవిని తీసేశారని విమర్శించారు. బంగారం లాంటి తన నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలకు పార్టీలో గౌరవం లేదని, అతికొద్ది మందికి మాత్రమే అది దక్కుతోందని విమర్శించారు. అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు బాధపడుతున్నారని మేకపాటి అన్నారు.

సస్పెన్షన్‌ చేసిన విధానం సరికాదు: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

తనను సస్పెండ్‌ చేయడంపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి స్పందించారు. వైకాపా నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు. అయితే, సస్పెండ్‌ చేస్తున్నట్లు ఏకపక్షాన నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. దానికి ఒక పద్ధతి ఉంటుందని, తొలుత షోకాజ్‌ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ, వైకాపా పెద్దలు ఒంటెద్దుపోకడలతో నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

‘‘ సస్పెన్షన్‌ వారిష్టం. చేసిన విధానం మాత్రం సరికాదు. సస్పెండ్‌ చేసిన విధానంపై ఈసీ జోక్యం చేసుకోవాలి. ఈసీ కల్పించుకొని సజ్జలపై కేసు నమోదు చేయాలి. ఏకపక్షంగా, పెత్తందారుల్లా మమ్మల్ని సస్పెండ్‌ చేశారు. నోటీసు ఇవ్వకుండా.. వివరణ తీసుకోకుండా వేటు వేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాం సరే.. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీదేవిపై ఏ ఆధారాల కింద చర్యలు తీసుకున్నారు. మేం డబ్బులకు అమ్ముడుపోయి ఓటేశామని అంటున్నారు. తెదేపా, జనసేన సభ్యులు ఏం తీసుకొని వైకాపాకు ఓటు వేశారు’’ అని కోటంరెడ్డి అన్నారు. వైకాపా సస్పెండ్‌ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇక నుంచి మరింత స్వేచ్ఛగా మా అభిప్రాయాలను చెబుతామన్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెదేపా అభ్యర్థి పంచుమర్తి  అనురాధ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం  23 ఓట్లు దక్కించుకుని ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెదేపా 23 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు సభ్యులు వైకాపాలో చేరారు. దీంతో తెదేపా బలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే గురువారం విడుదలైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెదేపా అభ్యర్థి అనురాధ 23 ఓట్లు సాధించారు. తెదేపా నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను వైకాపా లాక్కోగా... అదే వైకాపాలో అసంతృప్తిగా ఉన్న వారిలో నలుగురు తెదేపా అభ్యర్థినికి ఓటు వేయటంతో అనురాధ 23 ఓట్లు సాధించగలిగారు. వాస్తవంగా తెదేపా బలం ఎంతో.. ఈ ఎన్నికల్లో అన్నే ఓట్లు వచ్చాయి. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు