Visa: భారతీయ నిపుణులు కెనడాకు తరలిపోతున్నారు

కాలం చెల్లిన ఇమ్మిగ్రేషన్‌ విధానాలనే అమెరికా ఇప్పటికీ అనుసరిస్తోందంటూ నిపుణులు పెదవి విరిచారు.

Updated : 16 Jul 2021 15:11 IST

కాలం చెల్లిన వీసా విధానాలే కారణం 
‘హెచ్‌-1బి’పై పనిచేయడం కష్టంగా మారుతోంది 
పరిస్థితులను వెంటనే చక్కదిద్దాలి 
అమెరికా చట్టసభకు ఎన్‌ఎఫ్‌ఏపీ నివేదిక 

వాషింగ్టన్‌: కాలం చెల్లిన ఇమ్మిగ్రేషన్‌ విధానాలనే అమెరికా ఇప్పటికీ అనుసరిస్తోందంటూ నిపుణులు పెదవి విరిచారు. భారతీయ ప్రతిభావంతులు అమెరికాను కాదని కెనడాకు వెళ్లిపోతుండటానికి ఈ పాతకాలపు విధానాలే కారణమని పేర్కొన్నారు. ప్రధానంగా హెచ్‌-1బి వీసాల జారీకి సంబంధించిన నిబంధనలను వెంటనే మార్చాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. తమ దేశ ఇమ్మిగ్రేషన్‌ విధానాలపై ‘నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ)’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్టువర్ట్‌ అండర్సన్‌ చట్టసభలో ఈ మేరకు తాజాగా ఓ నివేదిక సమర్పించారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులు/ శాశ్వత నివాస హోదా మంజూరులో ప్రస్తుతం అమల్లో ఉన్న దేశాలవారీ కోటా విధానాన్ని అందులో తప్పుపట్టారు. భారతీయ నిపుణులు అమెరికాను వీడి కెనడాకు వెళ్లకుండా సత్వరం చర్యలు చేపట్టాలని సూచించారు. ‘‘ఉద్యోగ ఆధారిత కేటగిరీల్లో ప్రస్తుతం గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న భారతీయుల సంఖ్య 9,15,497. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య 2030 నాటికి 21,95,795కు చేరే అవకాశముంది. అంతమంది ఏళ్లపాటు, దశాబ్దాల తరబడి ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే పరిస్థితిని రానివ్వకూడదు’’ అని అండర్సన్‌ తమ నివేదికలో పేర్కొన్నారు. ‘‘విదేశీ నిపుణులు, విద్యార్థులు అమెరికాను కాకుండా కెనడాను ఎంచుకుంటున్నారు. అమెరికాలో ‘హెచ్‌-1బి’పై పనిచేయడం, శాశ్వత నివాస హోదా పొందడం కష్టంగా ఉండటం వల్లే అలా జరుగుతోంది. మన దేశంతో పోలిస్తే కెనడాలో శాశ్వత నివాస హోదా దక్కించుకోవడం సులభతరంగా ఉంది’’ అని తెలిపారు.

ప్రపంచం మారింది.. మన విధానాలు మారలేదు 

అమెరికా విశ్వవిద్యాలయాల్లో కంప్యూటర్‌ సైన్స్, ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించి గ్రాడ్యుయేట్‌ స్థాయిలో చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2016-17తో పోలిస్తే 2018-19 నాటికి 25 శాతానికి పైగా తగ్గిందని అండర్సన్‌ చెప్పారు. మరోవైపు కెనడా విశ్వవిద్యాలయాల్లో మాత్రం వారి సంఖ్య 2016లో 76,075గా ఉండగా.. 2018 నాటికి 1,72,625కు పెరిగిందన్నారు. ప్రతిభావంతులను ఆకర్షించే విషయంలో అమెరికా కంటే కెనడా ఇమ్మిగ్రేషన్‌ విధానాలు చాలా మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ‘‘అమెరికా విధానాలను చట్టసభ 1990లో రూపొందించింది. అప్పటికి స్మార్ట్‌ఫోన్‌లు, ఇ-కామర్స్, సోషల్‌ మీడియా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటివేవీ లేవు. 1990 తర్వాత ప్రపంచం చాలా మారింది. మన ఇమ్మిగ్రేషన్‌ విధానాలు మాత్రం మారలేదు’’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని