Ukraine Crisis: అణుదాడికి రష్యా సాహసించదనే అనుకుంటున్నా!

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు కేంద్రాన్ని (న్యూక్లియర్‌ ప్లాంటు) చేజిక్కించుకున్నంత మాత్రాన రష్యాకు ఎలాంటి ఉపయోగం ఉండదని, దాన్ని మూసివేసి 30 సంవత్సరాలకుపైనే అవుతోందని

Updated : 07 Mar 2022 09:54 IST

 అణుబాంబు పేలితే జరిగే నష్టాన్ని ఊహించలేం
 ‘ఈనాడు’తో న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ విశ్రాంత ఛైర్మన్‌ ఎన్‌.సాయిబాబా

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు కేంద్రాన్ని (న్యూక్లియర్‌ ప్లాంటు) చేజిక్కించుకున్నంత మాత్రాన రష్యాకు ఎలాంటి ఉపయోగం ఉండదని, దాన్ని మూసివేసి 30 సంవత్సరాలకుపైనే అవుతోందని హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ విశ్రాంత ఛైర్మన్‌ ఎన్‌.సాయిబాబా అన్నారు.
అణుబాంబు ప్రయోగం ఆఖరి అస్త్రమేనని, రష్యా అంతకు సాహసిస్తుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తీవ్రరూపుదాలుస్తున్న నేపథ్యం..వ్లాదిమిర్‌ పుతిన్‌ తమ దేశ అణుదళాలకు అప్రమత్తత ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరుగుతున్ననేపథ్యంలో ఆయనతో ‘ఈనాడు’ మాట్లాడగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

ఉక్రెయిన్‌ సహా దానికి మద్దతిచ్చే దేశాలపై రష్యా అణుదాడికి దిగే అవకాశం ఉందా?
అణుబాంబు ప్రయోగం చివరి అస్త్రం మాత్రమే. క్షేత్ర స్థాయికి వెళ్లి యుద్ధం చేయలేని పరిస్థితుల్లో మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా సహా ఏ దేశమూ దుందుడుకుగా అణుదాడికి సాహసించదనే అనుకుంటున్నా. ఒకవేళ ప్రయోగిస్తే ఆ తర్వాత ప్రపంచ దేశాల  నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవటం అంత సులువైన పనికాదు. ప్రయోగించిన దేశాన్ని యావత్‌ ప్రపంచం వెలివేస్తుంది. ప్రస్తుతం సాంకేతికత ప్రజల జీవనశైలిలో భాగమైంది. శాస్త్ర సాంకేతికను అన్ని దేశాలు పరస్పరం అందిపుచ్చుకుంటున్నాయి. వాణిజ్య అవసరాలు కూడా ప్రతి దేశానికీ ఉన్నాయి. ఏ దేశ అభివృద్ధికైనా ఎగుమతులు, దిగుమతులు కీలకంగా మారిన తరుణంలో ఆ బాంబు ప్రయోగం ఊహాజనితమే. 

అణుబాంబు ప్రయోగాన్ని అడ్డుకునే సాంకేతిక ఏదైనా ఉందా?
ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ను తరలించే వాహకాలను గుర్తించే రహస్య సాంకేతికత(స్టెల్త్‌ టెక్నాలజీ)ను అభివృద్ధి చేసేందుకు అగ్రదేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన రాడార్లు కూడా దాని అనవాళ్లను  గుర్తించలేవు. ఒకవేళ గుర్తించినా దాన్ని నిర్వీర్యం చేయడం సాధ్యం కాదు.

ఒకవేళ అణుదాడి జరిగితే నష్ట నివారణకు మార్గాలు ఏమిటి?
ప్రయోగించిన తరవాత అనుభవించటం మినహా నష్ట నివారణకు ఎలాంటి పరిష్కారం ప్రస్తుతానికి లేదు. ఆ బాంబు తీవ్రత ఎంత అనే దానిపై నష్టం ఆధారపడి ఉంటుంది. అది పేలిన ప్రాంతంలో ఎంత లోతున గొయ్యి పడుతుందో తీవ్రత అంత ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. దాన్నిబట్టే ఆ ప్రభావం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది.

- ఈనాడు, హైదరాబాద్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని