Updated : 14/01/2022 10:02 IST

Afghanistan: కడుపుతీపితోకిడ్నీల అమ్మకాలు..అఫ్గాన్‌లో దారుణ పరిస్థితులు

పిల్లల ఆకలి తీర్చేందుకు తండ్రుల తెగింపు

కాబుల్‌: తాలిబన్ల పాలనలో అఫ్గాన్ల పరిస్థితి దయనీయంగా మారింది. చేసేందుకు పని.. చేతిలో డబ్బు.. తినేందుకు తిండి కరవయ్యాయి. ఆకలి బాధతో చిన్నాపెద్దా అలమటిస్తున్నారు. పిల్లల కడుపు నింపేందుకు తండ్రులు దిక్కుతోచని స్థితిలో తమ శరీర భాగాలను అమ్ముకుంటున్నారు. చిన్నారులను కాపాడుకొనేందుకు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. ‘‘నేను బయటకు వెళ్లి డబ్బులు అడుక్కోలేను. అందుకే ఆసుపత్రికి వెళ్లి నా కిడ్నీని లక్షా 69 వేలకు అమ్మేశా. ఆ డబ్బుతో కనీసం నా పిల్లలకు కొంతకాలమైనా తిండి పెడతాను’’ అని గులాం హజ్రత్‌ అనే వ్యక్తి చెప్పారు. అఫ్గాన్‌లో చాలామంది తండ్రులు ఇదేతరహా వ్యథలో ఉన్నారు.

తాలిబన్లు అధికారంలోకి వచ్చాక అఫ్గానిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దుర్భల పేదరికంలోకి జారుకున్న ప్రజలు.. డబ్బు కోసం అవయవాలను అమ్ముకునేందుకు వెనకాడటం లేదు. హెరాత్‌ ప్రావిన్స్‌లో కొన్ని నెలలుగా కిడ్నీల విక్రయాలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా చాలామంది కిడ్నీలు అమ్మేందుకు ముందుకొస్తున్నారని స్థానిక వైద్యులు తెలిపారు. కిడ్నీ దాత, కొనుగోలుదారు పరస్పర అంగీకారంతోనే ఇలా జరుగుతోందన్నారు. కిడ్నీని కోల్పోవడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలకంటే వారి కుటుంబ పోషణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. కిడ్నీ తొలగించాక కనీసం ఏడాది పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నప్పటికీ.. ఎవరూ లెక్క చేయడం లేదు. రెండు నెలలకే దొరికిన పనికి వెళ్లిపోతున్నారు. తమ ఆర్థిక స్థితికి ఖాళీగా ఉండలేమని గోడు వెళ్లబోసుకుంటున్నారు. చాలామంది ప్రాణ భయంతో ఇప్పటికే దేశం విడిచివెళ్లారని, వారిలో కొందరిని ఆయా దేశాలు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపాయని స్థానిక మత పెద్ద చెప్పారు. దేశం విడిచి వెళ్లేముందు.. ఇక్కడున్న అప్పులు తీర్చేందుకు కూడా చాలా మంది కిడ్నీలు అమ్ముతున్నారని వివరించారు.

ఆదుకోకుంటే ఆకలి చావులే 87 లక్షల మంది ప్రాణాలకు ముప్పు

బ్రస్సెల్స్‌: అఫ్గాన్‌లో ఆకలి సునామీ రాబోతోందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలన్నీ రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి తక్షణమే మానవతా సాయం అందించాలని అఫ్గాన్‌లోని డబ్ల్యూఎఫ్‌పీ ప్రతినిధి మేరీ ఎల్లెన్‌ మెక్‌గ్రోర్టీ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రస్తుతం 2.28 కోట్ల మందికి తీవ్రమైన ఆహార కొరత ఉందని, ఇందులో 87 లక్షల మంది ఆకలిచావులకు చేరువయ్యారని ఆమె వాపోయారు. అఫ్గాన్ల ఆకలి తీర్చేందుకు తమకు నిధుల కొరత తీవ్రంగా ఉందన్నారు. వచ్చే 12 నెలల పాటు పూర్తిస్థాయిలో మానవతా సాయం కొనసాగించేందుకు కనీసం 4.4 బిలియన్‌ డాలర్లు కావాలన్నారు. ఆహార పంపిణీ కనీస స్థాయిలో చేపట్టాలన్నా 2.6 బిలియన్‌ డాలర్లు అవసరమని చెప్పారు. అఫ్గాన్‌కు గతంలో సాయం చేసిన వారంతా మానవతాదృక్ఫథంతో తిరిగి ప్రారంభించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. 


Read latest Related-stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని