Gujarat: భూమి నుంచి అగ్నిజ్వాలలు.. ఏళ్లుగా ఆరని అఖండ జ్యోతులు

గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లా, జగతియా గ్రామంలో భూమిలో నుంచి అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. భూగర్భం నుంచి గ్యాస్‌ పైప్‌లైన్‌ వేశారేమో? అని అనుకునేంతలా నిరంతరం మంటలు రగులుతూనే ఉన్నాయి. గ్రామంలోని మాతా హర్‌సిద్ధి

Updated : 30 Jun 2022 08:08 IST

గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లా, జగతియా గ్రామంలో భూమిలో నుంచి అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. భూగర్భం నుంచి గ్యాస్‌ పైప్‌లైన్‌ వేశారేమో? అని అనుకునేంతలా నిరంతరం మంటలు రగులుతూనే ఉన్నాయి. గ్రామంలోని మాతా హర్‌సిద్ధి మందిరంలో ఈ అఖండ జ్యోతి ఉండడంతో ప్రజలు భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. ఆలయంలో మొత్తం మూడు అఖండ జ్యోతులు వెలుగుతున్నాయి. రెండు జ్యోతులు ప్రత్యేకంగా ఓ గదిలో ఉండగా.. ఒకటి గుడి ఆవరణలో ఉంది. భక్తులు ఆహారం వండుకోవడానికి, ఏవైనా ప్రయోగాలు చేయడానికి బయటి జ్యోతిని వినియోగిస్తున్నారు. ఈ మంటపై వండిన ఆహారం తింటే రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. లోపల ఉన్న రెండు అఖండ జ్యోతులు.. ఎలాంటి అంతరాయం లేకుండా వెలుగుతున్నాయి. ఈ మంటలు ఎప్పుడు ప్రారంభమయ్యాయనే విషయమై స్పష్టత లేదు. చాలా ఏళ్ల నుంచి ఇవి వెలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జగతియా గ్రామంలో గ్యాస్‌ ఎందుకు బయటకు వస్తోందనే విషయాన్ని తెలుసుకునేందుకు గతంలో పరిశోధనలు జరిగాయి. 1921లో కెప్టెన్‌ పాల్మెర్‌.. ఇక్కడ దర్యాప్తు నిర్వహించారు. గ్యాస్‌ని వెలికితీసేందుకు తవ్వకాలు జరిపారు. అయితే.. మంటలకు కారణం ఏమిటన్న విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. 1970లలో ఓఎన్‌జీసీ సైతం ఈ ప్రాంతంపై దృష్టిసారించింది. గ్యాస్‌ లీక్‌పై పరిశోధన చేపట్టింది. అందులోనూ ఎలాంటి విషయం వెల్లడవలేదు. ఫలితంగా, స్థానికుల్లో ఈ మంటల పట్ల భక్తిభావం మరింత పెరిగింది.

ఈ జ్వాలల చుట్టూ కొన్ని కథలు కూడా అల్లుకున్నాయి. గుజరాతీ వ్యాపారి, మానవతావాది అయిన సేఠ్‌ జగదూష.. జగతియా గ్రామానికి దగ్గర్లో ఉన్న కోడినార్‌లో జన్మించారు. భారతంలోని కర్ణుడే పునర్జన్మ సాధించి జగదూషగా వచ్చాడని ఇక్కడివారు నమ్ముతుంటారు. ‘‘కర్ణుడు తన జీవితంలో అనేక దానధర్మాలు చేసినా.. ఆహారాన్ని మాత్రం దానం చేసేవాడు కాదు. అందుకే స్వర్గానికి వెళ్లిన తర్వాత కర్ణుడికి ఆహారం లభించలేదు’’ అని కథ ప్రచారంలో ఉంది. సేఠ్‌ జగదూషలా కర్ణుడు జన్మించిన తర్వాత.. స్థానికంగా పంటలు బాగా పండాయని కథలుగా చెబుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని