అబుధాబిలో డ్రోన్‌ దాడులు!

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుధాబి సోమవారం పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని ఓ ప్రధాన చమురు కంపెనీని లక్ష్యంగా చేసుకొని.. డ్రోన్‌ల ద్వారా జరిగినట్లుగా భావిస్తున్న దాడిలో ముగ్గురు

Updated : 18 Jan 2022 06:19 IST

చమురు ట్యాంకర్లు పేలి ఇద్దరు భారతీయుల దుర్మరణం

పాక్‌ జాతీయుడు కూడా మృత్యువాత.. ఆరుగురికి గాయాలు

హుతీ తిరుగుబాటుదారుల దారుగతమే?

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుధాబి సోమవారం పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని ఓ ప్రధాన చమురు కంపెనీని లక్ష్యంగా చేసుకొని.. డ్రోన్‌ల ద్వారా జరిగినట్లుగా భావిస్తున్న దాడిలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు కాగా.. మరొకరు పాకిస్థాన్‌ జాతీయుడు. వారి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. తాజా దాడులకు పాల్పడింది తామేనని యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. క్షతగాత్రులు ఏ దేశానికి చెందినవారన్నది తెలియరాలేదు.

అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ముసాఫా పారిశ్రామిక ప్రాంతంలో అబుధాబి జాతీయ చమురు కంపెనీ (ఏడీఎన్‌వోసీ) వద్ద ఎగిరే చిన్నపాటి వస్తువులు పడ్డాయని.. అవి డ్రోన్లే అయ్యుండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. వాటి తీవ్రతకు మూడు చమురు రవాణా ట్యాంకర్లు పేలిపోయి విధ్వంసం చోటుచేసుకుందని తెలిపారు. విమానాశ్రయం విస్తరణ ప్రక్రియలో భాగంగా పనులు జరుగుతున్న ప్రాంతంలోనూ డ్రోన్ల వంటి వస్తువుల వల్ల మంటలు వ్యాపించాయని వెల్లడించారు. బలగాలు హుటాహుటిన స్పందించి అగ్నికీలలను ఆర్పివేశాయని చెప్పారు. తాజా దాడులకు తెగబడింది ఎవరన్నది ప్రస్తుతానికి తాము స్పష్టంగా చెప్పలేమన్నారు. ఇద్దరు భారతీయులు మృత్యువాతపడ్డ నేపథ్యంలో మరిన్ని వివరాల కోసం స్థానిక అధికార యంత్రాంగాన్ని సంప్రదిస్తున్నట్లు యూఏఈలోని భారతీయ రాయబార కార్యాలయం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

* యెమెన్‌లో ఇరాన్‌ మద్దతుతో కూడిన హుతీ తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా నేతృత్వంలో పోరాడుతున్న సంకీర్ణ బలగాల్లో యూఏఈ సైనికులు కూడా ఉన్నారు. 2015 నుంచి యెమెన్‌ యుద్ధంలో యూఏఈ పాల్గొంటోంది. అక్కడ క్షేత్రస్థాయిలో తమ బలగాల సంఖ్యను ఇటీవల తగ్గించినప్పటికీ.. వివిధ మార్గాల్లో సంకీర్ణ దళాలకు అండగా నిలుస్తోంది. ఇటీవల పలు ప్రాంతాలపై పట్టు కోల్పోయి రగిలిపోతున్న హుతీ తిరుగుబాటుదారులు.. ప్రతీకారంగా అబుధాబిలో తాజా దాడులకు పాల్పడి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు