కరోనాపై మన పోరు అపూర్వం

కరోనా మహమ్మారిపై పోరులో భారత్‌ సాగించిన ప్రస్థానం అపూర్వమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్న జాగ్రత్తల్ని పాటించడం దేశ పవిత్ర కర్తవ్యంగా మారిందనీ, ఈ సంక్షోభమంతా ముగిసిపోయేవరకు దీనిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Updated : 26 Jan 2022 05:36 IST

ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ల కార్యక్రమం భారత్‌ది
జాగ్రత్తలు పాటించడం దేశ కర్తవ్యంగా మారింది
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి కోవింద్‌

దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో భారత్‌ సాగించిన ప్రస్థానం అపూర్వమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్న జాగ్రత్తల్ని పాటించడం దేశ పవిత్ర కర్తవ్యంగా మారిందనీ, ఈ సంక్షోభమంతా ముగిసిపోయేవరకు దీనిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. బుధవారం జరగనున్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘కరోనా వచ్చిన మొదటి ఏడాదే సదుపాయాలు పెంచుకున్నాం. రెండో ఏడాది వ్యాక్సిన్లు తయారు చేసుకుని, ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇతర దేశాలకు సాయమందించాం. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందాం. ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సిబ్బంది అలుపెరుగని సేవలు అందించారు. రెండేళ్లయినా కరోనాతో పోరాటం ఇంకా అంతం కాలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. కరోనాకు రెండు టీకాలు రూపొందించడం దేశానికి గర్వకారణం. కఠిన సమయంలోనూ దేశ ప్రజలు పోరాటస్ఫూర్తి చాటారు. కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. యువత స్టార్టప్‌లతో అద్భుతాలు సృష్టిస్తోంది. బలమైన దేశం ఇప్పుడు ఆవిర్భవిస్తోంది. ఐక్యతను, ఒకే దేశం అనే స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏటా గణతంత్ర దినోత్సవం జరుపుకొంటాం. కరోనా కారణంగా ఈసారి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నప్పటికీ.. స్ఫూర్తి మాత్రం ఎప్పటిలాగే బలంగా ఉంది. మనందరిలో ఉమ్మడిగా ఉన్న భారతీయతను పండగలా జరుపుకొనేందుకు గణతంత్ర వేడుక ఒక తరుణం’’ అని రాష్ట్రపతి చెప్పారు. దేశ సరిహద్దుల్ని, దేశంలో శాంతిభద్రతల్ని కాపాడడంలో సైనికులు, పోలీసులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని