Andhra News: రూ.3వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల రుణం స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ రుణం తీసుకోనుంది.

Updated : 07 May 2022 07:17 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల రుణం స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ రుణం తీసుకోనుంది. రిజర్వు బ్యాంకు సెక్యూరిటీల వేలానికి సంబంధించి శుక్రవారం వెలువరించిన నోటిఫికేషన్‌లో విషయం వెల్లడయింది. వరుసగా 10, 15, 19 ఏళ్ల కాలపరిమితితో రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. బహిరంగ మార్కెట్‌ రుణం పొందేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర వ్యయ విభాగం అనేక విధాలుగా సమాచారం కోరింది. ఇంతవరకు రాష్ట్రం గతేడాది, అంతకుముందు సంవత్సరాల్లో చేసిన అప్పు ఎంతో తేల్చి చెప్పాలని కోరింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఈ లోపు రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక మంత్రి సైతం దిల్లీ వెళ్లి రుణ అనుమతులకు ప్రయత్నాలు సాగించారు. ఈ క్రమంలోనే రూ.3,000 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి లభించినట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అంతవరకు తాత్కాలిక అనుమతులు లభించాయా? తొలి 9 నెలల కాలానికి బహిరంగ మార్కెట్‌ రుణ పరిమితిని తేల్చి కేంద్రం అనుమతులు ఇచ్చిందా అన్నది ఇతమిత్థంగా ఇంకా సమాచారం తెలియలేదు. మంగళవారం వేలంలో రుణం సమీకరిస్తే బుధవారం నాటికి ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. ప్రస్తుతం ఈ నెలలో రాష్ట్రం రూ.1,600 కోట్ల మేర జీతాలు, మరో రూ.600 కోట్ల మేర సామాజిక పింఛన్లు, ఇతరత్రా మరో రూ.200 కోట్ల చెల్లింపులు మాత్రమే చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని