విదేశీ రెక్కలకు వీడని చిక్కులు!

రెండేళ్లుగా కొవిడ్‌ సంక్షోభం.. దేశాలన్నీ దారులు మూసే తలుపులు వేసేసిన కాలం.. ప్రపంచమంతా లాక్‌డౌన్‌.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి.. తలుపులు

Published : 20 May 2022 06:08 IST

పాస్‌పోర్టుల జారీలో తీవ్ర జాప్యం

అమరావతిలో ‘విదేశ్‌ భవన్‌’పై ఎప్పుడో!

అధికారులు, సిబ్బంది కొరత పెద్ద సమస్య

పెండింగులో పదివేలకు పైగా దరఖాస్తులు

ఈనాడు, విశాఖపట్నం: రెండేళ్లుగా కొవిడ్‌ సంక్షోభం.. దేశాలన్నీ దారులు మూసే తలుపులు వేసేసిన కాలం.. ప్రపంచమంతా లాక్‌డౌన్‌.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి.. తలుపులు తెరుచుకుంటున్నాయి.. ఉన్నత చదువుల కోసమో ఉద్యోగం నిమిత్తమో రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోదామనుకుంటే రాష్ట్రంలో పాస్‌పోర్టు పొందడమే పెద్ద సమస్యగా మారింది. ఉన్నతాధికారులు, సిబ్బంది కొరత.. ఇన్‌ఛార్జీ పాలన వల్ల పాస్‌పోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దాదాపు 10వేల మందికి పైగా పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్నారు. అసలు పాస్‌పోర్టు రాష్ట్ర కార్యాలయానికి సొంతగూడైనా లేని దుస్థితి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ‘విదేశ్‌ భవన్‌’ పేరిట పాస్‌పోర్టు సేవల ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో నిర్మించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయించింది. అది అందుబాటులోకి వచ్చేవరకు కానూరులోని ఓ అద్దె భవనంలో కార్యాలయం ఏర్పాటుచేయాలని భావించారు. అనంతరం మూడు రాజధానుల అంశం తెరమీదికి రావడంతో విదేశీభవన్‌ ఎక్కడ కట్టాలన్న విషయం తేలక ఆ శాఖ ఉన్నతాధికారులు రెండేళ్లుగా పట్టించుకోవడంలేదు. దీంతో విజయవాడలోని పాస్‌పోర్ట్‌ అధికారికి ప్రత్యేక కార్యాలయమైనా లేక పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలోనే ఉండాల్సి వస్తోంది.

విశాఖకు అధికారి ఏరి?
విశాఖ కార్యాలయ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిగా విధులు నిర్వర్తించిన ఎన్‌.ఎల్‌.పి.చౌదరి ఉద్యోగ విరమణ అనంతరం రెండేళ్లుగా ఇక్కడ పూర్తిస్థాయి అధికారే లేరు. హేమనాథన్‌ అనే అధికారి కొద్దికాలంపాటు విశాఖలో విధులు నిర్వర్తించారు. ఆయనకూ బదిలీ అయ్యాక విశాఖలో పూర్తిస్థాయి ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిని నియమించలేదు. విజయవాడలో విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి శ్రీనివాసరావుకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. సుదూరంలోని వేర్వేరుచోట్ల ఉన్న రెండు కీలక ప్రధాన కార్యాలయాల బాధ్యతలను ఆయనే నిర్వర్తించాల్సి వస్తోంది.

అధికారులేమంటున్నారు..?
విశాఖ పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో పదకొండు మంది అధికారులకుగాను నలుగురే ఉన్నారని వారిలో ఒకరు భీమవరంలో పని చేయాల్సి వస్తోందని ఓ అధికారి పేర్కొంటున్నారు. ఇటీవల విదేశాలకు వెళ్లేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందని.. ఫలితంగా వేలాది మంది పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. అందుకే దరఖాస్తు ప్రక్రియ.. మంజూరులో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.

తత్కాల్‌కూ జాప్యమే?
విశాఖలోని పాస్‌పోర్ట్‌ అధికారి కార్యాలయంలో ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి పోస్టు సహా పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నా 15 నుంచి నెలరోజుల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి. మంజూరుకూ చాలా సమయం పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సేవల్లో జరుగుతున్న జాప్యంపై ఒక దరఖాస్తుదారు ఏకంగా ఉపరాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేయడం ఇటీవల పాస్‌పోర్ట్‌ కార్యాలయ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ‘తత్కాల్‌’ కింద దరఖాస్తు చేసినా నెల నుంచి రెండు నెలల వరకు పడుతోందని, అత్యవసరమని చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

పరిష్కారాలపై దృష్టి ఏది?
* పెండింగ్‌ దరఖాస్తులు ఎక్కువగా ఉంటే ఇతర కార్యాలయాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించి ప్రత్యేక డ్రైవ్‌ పెట్టవచ్చు. కానీ కొన్ని నెలలుగా అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దరఖాస్తులు వేలల్లో పేరుకుపోయాయి.

* ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేస్తే సిబ్బంది కొరత తీరే అవకాశం ఉంటుంది.

* కనీసం కొందరిని డిప్యుటేషన్‌పై పంపించి సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన కూడా కేంద్రస్థాయి ఉన్నతాధికారుల్లో కొరవడిందనే విమర్శలొస్తున్నాయి.

* రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు పాస్‌పోర్ట్‌ సమస్యలపై దృష్టిపెట్టడంలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని