కోరలు చాస్తున్న క్యాన్సర్‌

రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా 1.81 లక్షల కేసులు నమోదుకాగా, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారు వేలల్లో ఉంటారని అంచనా. ప్రస్తుతం నిర్వహిస్తున్న అసాంక్రమిక, సాంక్రమిక వ్యాధుల సర్వే (ఎన్‌సీడీ, సీడీ)లో 32 వేల మందిలో వివిధ రకాల క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ఇందులో సర్వైకల్‌ 17 వేలు, ఓరల్‌ 10 వేలు, రొమ్ము క్యాన్సర్ల లక్షణాలు ఐదు వేల మందిలో గుర్తించారు. గతేడాది

Published : 22 May 2022 05:51 IST

సర్వేలో భారీగా అనుమానిత కేసుల గుర్తింపు

ముందస్తు నిర్ధారణ పరీక్షలకు సన్నాహాలు

ఆరోగ్యశ్రీ ట్రస్టులో 1.81 లక్షల మందికి చికిత్స

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా 1.81 లక్షల కేసులు నమోదుకాగా, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారు వేలల్లో ఉంటారని అంచనా. ప్రస్తుతం నిర్వహిస్తున్న అసాంక్రమిక, సాంక్రమిక వ్యాధుల సర్వే (ఎన్‌సీడీ, సీడీ)లో 32 వేల మందిలో వివిధ రకాల క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ఇందులో సర్వైకల్‌ 17 వేలు, ఓరల్‌ 10 వేలు, రొమ్ము క్యాన్సర్ల లక్షణాలు ఐదు వేల మందిలో గుర్తించారు. గతేడాది ఆగస్టులో కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏపీలో మూడున్నరేళ్లలో 2.06 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డారు. 2018 నుంచి 2020 వరకు ఏటా కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. గతంలో 50 ఏళ్లు దాటిన వారికి క్యాన్సర్‌ సోకగా, ఇటీవల 30-40 ఏళ్లలోనూ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ఆందోళన రేపుతోంది.

* ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా 2018-19 నాటికి 1,25,848 క్యాన్సర్‌ కేసులు నమోదై ఉన్నాయి. ఈ సంఖ్య 2019-20లో 1,23,273కు, 2020-21లో 1,46,806కు, 2021-22 నాటికి 1,81,957కు చేరింది. ఈ 1.81 లక్షల కేసుల్లో 26% రొమ్ము, 23% సర్వైకల్‌ కావడం తీవ్రతను చాటుతోంది. గ్లోబకాన్‌-2020 (డబ్ల్యూహెచ్‌వో సంస్థ) లెక్కల ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా 13.24 లక్షల కేసులు బయటపడ్డాయి. వీరిలో 6.78 లక్షలు పురుషులు, 6.46 లక్షల మంది మహిళలున్నారు. 8.51లక్షల మంది మరణించారు.

అప్రమత్తతతోనే అడ్డుకట్ట

క్యాన్సర్‌ లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్నారని, మూడో, నాలుగో దశల్లో ఆస్పత్రికి రావడం వల్ల ప్రాణాలు నిలబెట్టడం కష్టమవుతోందని వైద్యులు చెబుతున్నారు.

* నాలుక, నోటి లోపలి భాగంలో పుండ్లు, తెల్లటిపూత నెలలపాటు ఉంటే వైద్యులను సంప్రదించాలి. నోరు తెరుచుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా అప్రమత్తం కావాలి.

* రొమ్ముల్లో కణితులను గుర్తిస్తే వెంటనే పరీక్షించుకోవాలి. తల్లి, మేనత్త, సమీప బంధువుల్లో క్యాన్సర్లు ఉన్నా జాగ్రత్తపడాలి. జన్యుపరంగా వచ్చే కేసులు 8-9శాతం వరకు ఉంటున్నాయి.

* లైంగికచర్య తర్వాత జననాంగాలపై ఎర్రటి దద్దుర్లు, పొక్కులు కన్పిస్తే పరీక్ష చేయించుకోవాలి.

* సిగరెట్లు, చుట్టలు, పొగాకు పదార్థాలు వాడేవారిలో ఊపిరితిత్తులు, నాలుక, అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయి.

* అధిక మద్యపానం, ఊబకాయం, వేపుళ్లు, నిల్వ ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, జననాంగాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, మానసిక ఒత్తిడి కూడా కారణమవుతున్నాయి.

* ఆరోగ్యకర జీవనశైలి, వ్యాయామం, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలతో మిళితమైన ఆహారం తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.


మొబైల్‌ శిబిరాలతో గుర్తింపు

ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు సూచనల మేరకు మార్చి 26న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. 205 మంది మహిళలను పరీక్షించగా, 64 మంది రిస్క్‌ గ్రూపులో ఉన్నట్లు గుర్తించారు. పది మంది రొమ్ముల్లో కణితులు అనుమానాస్పదంగా ఉన్నాయి. వీరికి జీజీహెచ్‌లో తదుపరి పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలింది. వారి నేపథ్యాన్ని బట్టి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. 111 మంది మహిళల గర్భాశయాల నుంచి సేకరించిన నమూనాలు (ప్యాస్మిర్‌) పరీక్షించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. 32 మంది పురుషులను పరీక్షించగా, ఇద్దరిలో నోటిపూత అనుమానంగా కనిపించింది. ఇదే తరహా శిబిరం త్వరలో చిత్తూరు జిల్లాలో    నిర్వహించనున్నారు. శిబిరాల కోసం ‘మమోగ్రఫీ’ సౌకర్యం ఉన్న మొబైల్‌ వాహనాలు తెప్పిస్తున్నారు.
2021-22లో ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా చికిత్స కోసం నమోదైన కేసుల్లో ఏ తరహావి ఎన్ని ఉన్నాయంటే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని