నేనున్నాను.. ‘నేను విన్నాను అన్నారే...’ ఎక్కడున్నారయ్యా!

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో నిలదీతల పర్వం కొనసాగుతూనే ఉంది. గ్రామాల సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలపై మంగళవారం ఎమ్మెల్యేలపై ప్రశ్నల జడివాన కురిసింది. ‘నేనున్నాను.. నేను విన్నానంటూ రోజూ చెబుతున్నారే...

Updated : 25 May 2022 09:43 IST

‘గడప గడపలో’ అనంతపురం ఎమ్మెల్యేను ప్రశ్నించిన వృద్ధ దంపతులు
ఆయన వెళ్లిపోయాక అనుచరులు, అధికారి బెదిరింపులు

న్యూస్‌టుడే, యంత్రాంగం: ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో నిలదీతల పర్వం కొనసాగుతూనే ఉంది. గ్రామాల సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలపై మంగళవారం ఎమ్మెల్యేలపై ప్రశ్నల జడివాన కురిసింది. ‘నేనున్నాను.. నేను విన్నానంటూ రోజూ చెబుతున్నారే... ఎక్కడున్నారయ్యా మీరు’ అంటూ వృద్ధ దంపతులు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ప్రశ్నించారు. తమ సమస్యను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అనంతపురంలోని మంగళవారి కాలనీలో షేక్‌ ఖలీల్‌ అహ్మద్‌, దిల్షాద్‌ బేగమ్‌ దంపతులు వాపోయారు. మంగళవారం ఎమ్మెల్యే తమ కాలనీకి రాగా... ‘నేను టైలరింగ్‌ చేస్తూ బతుకుతున్నాను. మాకు కారు ఉందంటూ పింఛన్‌, ఇంటి పట్టా, చేయూత వంటి పథకాలేవీ వర్తింపజేయడం లేదు. వాలంటీరుకు, సచివాలయ ఉద్యోగులకు చెబితే సంవత్సరం నుంచి అక్కడకు వెళ్లు.. ఇక్కడకు వెళ్లు.. అంటున్నారే గాని పరిష్కారం కావడం లేదు’ అని ఖలీల్‌ అహ్మద్‌ వాపోయారు. ‘నేను ఉన్నాను కాబట్టే వచ్చాను. మీ సమస్యను తీర్చి పథకాలు వర్తింపజేస్తాన’ని ఎమ్మెల్యే హామీ ఇచ్చి వెళ్లిపోయారు. తర్వాత కొందరు అనుచరులు ఖలీల్‌ అహ్మద్‌ వద్దకు వచ్చి నగరపాలక స్థలంలో బంకు వేసుకొని మళ్లీ మమ్మల్నే ప్రశ్నిస్తావా’ అంటూ బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ఓ అధికారి సైతం వారికే మద్దతు పలుకుతూ ‘వెంటనే బంకును వెనక్కి జరుపుకో’ అంటూ వృద్ధుడిని హెచ్చరించడం గమనార్హం.


ఎమ్మెల్యేలకు నిరసన సెగ

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చల్లంనాయుడువలసలో ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు చుక్కెదురైంది. సొంత పార్టీ సర్పంచి వర్గం ఆయన్ని ఊరి పొలిమేరలోనే అడ్డుకొంది. ఏం అభివృద్ధి చేశారని ప్రజలకు చెబుతారని, అనర్హులకు పథకాలతో లబ్ధి చేకూర్చారని ఆయన్ని ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది.

* విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడును జెర్రి మల్లమ్మ అనే వృద్ధురాలు తన భర్త పింఛన్‌ను స్థానిక నాయకులు రద్దు చేయించారని మండిపడ్డారు. అన్ని అర్హతలుంటే తక్షణమే పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


నిలదీస్తే మండిపడిన ఎమ్మెల్యే

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెంలో మంగళవారం రాత్రి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రసంగిస్తూ సమస్యలన్నీ పరిష్కరిస్తానని, డ్రైనేజీలను వేయిస్తానని హామీ ఇచ్చారు. స్థానికుల్లో ఒక వ్యక్తి... ‘ఎన్నికలై మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ గ్రామంలో సరైన డ్రైనేజీలు లేవు. ఇంకెప్పుడు వేస్తారు? ఈ పరిపాలనలో అవుతుందా?’ అని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ‘నేను చెయ్యను వెళ్లు’ అని అంటూనే, ‘ఒక్క నిమిషం ఆగు... చెప్పేది విను’ అన్నారు. ‘చెయ్యని వారు మా ఊరెందుకు వచ్చారు? వెళ్లిపోండ’ని ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు. ఆగ్రహానికి గురైన చంటిబాబు ప్రచార రథంపై నుంచి కోపంతో ఆయన వద్దకు దిగి వచ్చేలోగా స్థానికులు సర్దిచెప్పి పంపించేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని