2020లో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

కరోనా కారణంగా 2020లో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఆ ఏడాది దేశంలో ప్రమాదాల్లో 18.46%, మరణాల్లో 12.83% తగ్గుదల కనిపించింది. గాయపడ్డవారిలోనూ 22.8%మేర క్షీణత నమోదైంది. తెలుగు

Updated : 26 May 2022 06:21 IST

ప్రమాదాలు 18.46%, మరణాలు 12.83% తగ్గుదల
తెలుగురాష్ట్రాల్లోనూ అదే తీరు
కరోనా ఆంక్షలే ప్రధాన కారణం

ఈనాడు, దిల్లీ: కరోనా కారణంగా 2020లో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఆ ఏడాది దేశంలో ప్రమాదాల్లో 18.46%, మరణాల్లో 12.83% తగ్గుదల కనిపించింది. గాయపడ్డవారిలోనూ 22.8%మేర క్షీణత నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తగ్గుదల కనిపించింది. కేంద్రరవాణా, రహదారులశాఖ బుధవారం రాత్రి విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక-2020 ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 1,003 ప్రమాదాలు చోటుచేసుకోగా, 360 మంది చనిపోయారు. 954 మంది గాయపడ్డారు. అంటే ప్రతి గంటకు జరిగే 42 ప్రమాదాల్లో 15 మంది ప్రాణాలు కోల్పోతుండగా, 40 మంది క్షతగాత్రులుగా మిగులుతున్నట్లు తేలింది.

2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 1,31,714 మంది చనిపోగా, 3,48,279 మంది గాయపడ్డారు.

2019తో పోలిస్తే 2020లో 18.46% ప్రమాదాలు తగ్గాయి. మరణించిన వారిసంఖ్య 12.84%, గాయపడ్డవారి సంఖ్య 22.84%మేర తగ్గింది.

2020లో కనీసం ఒక్కరైనా మరణించిన ప్రమాదాలు 1,20,806 చోటుచేసుకున్నాయి. 2019తో పోలిస్తే ఇది 12.23% తక్కువ.

2020లో ప్రతి 100 ప్రమాదాలకు మరణాలు 2.3%మేర పెరిగాయి.

మొత్తం ప్రమాదాల్లో 31.8% జాతీయరహదారుల్లో, 24.8% రాష్ట్ర రహదారుల్లో, 43.4% ఇతర రహదారుల్లో జరిగాయి.

మరణాలు సంభవించిన ప్రమాదాల్లో 35.9% జాతీయరహదారులు, 25% రాష్ట్ర రహదారులు, 39.1% ఇతర రహదారుల్లో చోటుచేసుకున్నాయి.

అత్యధిక ప్రమాదాలు తమిళనాడులో, అత్యధిక మరణాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి.

69.3% మంది అతి వేగం కారణంగానే చనిపోయారు. 5.6% మంది రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ కారణంగా ప్రాణాలొదిలారు. 2.2% మంది మొబైల్‌ ఫోన్‌ వినియోగం కారణంగా చనిపోయారు.

65% ప్రమాదాలు నేరుగా ఉన్న రోడ్లలోనే చోటుచేసుకున్నాయి.

మరణించినవారిలో 69% మంది 18-45 ఏళ్లలోపు యువకులే.

ద్విచక్రవాహనదారులే (43.5%) అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి స్థానంలో పాదచారులు (17.8%) ఉన్నారు.

68% మరణాలు పల్లెల్లో జరిగితే 32% పట్టణాల్లో చోటుచేసుకున్నాయి.

ప్రమాదాలకు గురైన వారిలో 72% మందికి లైసెన్స్‌ ఉంది. లైసెన్స్‌లేని వారి నిష్పత్తి 9.5%.

యాక్సిడెంట్ల తీవ్రత తెలుగు రాష్ట్రాలు జాతీయ సగటుతో సమానంగా(36) నిలిచాయి.

హెల్మెట్‌ ధరించని కారణంగా 30% మంది, సీట్‌బెల్ట్‌ ధరించని కారణంగా 11.5% మంది చనిపోయారు.

అత్యధిక ప్రమాదాల జాబితాలో ఏపీ 7, తెలంగాణ 8వ స్థానంలో నిలిచాయి.

ఏపీలో 7,039 (5.3%), తెలంగాణలో 6,882 (5.2%) మంది ప్రాణాలు కోల్పోయారు.

2019తో పోలిస్తే 2020లో ఏపీలో 11.3%, తెలంగాణలో 11.1% ప్రమాదాలు తగ్గాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని