వైకాపా నిజస్వరూపం బయటపడింది: భాజపా

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్‌ పర్యటన తర్వాత వైకాపా నిజస్వరూపం బయటపడిందని, వైకాపా మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో రాష్ట్ర ప్రజలకు

Published : 09 Jun 2022 05:37 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్‌ పర్యటన తర్వాత వైకాపా నిజస్వరూపం బయటపడిందని, వైకాపా మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థమైందని భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. వైకాపాది అవినీతి ఎజెండా అయితే.. భాజపాది అభివృద్ధి ఎజెండా అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జేపీ నడ్డాపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటని, ఆయన గురించి మాట్లాడే స్థాయి మంత్రులకు లేదన్నారు. దేశంలోనే మద్యం ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ అని, మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఏం అభివృద్ధి జరగలేదని, వైకాపా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏం ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారని, ఎయిమ్స్‌ ఎక్కడి నుంచి వచ్చిందని, కేంద్రం ఇచ్చిన ఐఐటీ, జాతీయ రహదారులు కనబడటం లేదా అని ప్రశ్నించారు. మంత్రుల ఇళ్లు తగలబడితే కాపాడుకోలేని మీరు.. ప్రజలను ఎలా కాపాడతారని నిలదీశారు. మూడు నెలలకోసారి ప్రధానమంత్రిని కలుస్తున్న సీఎం జగన్‌ ఎందుకు ప్రత్యేకహోదా గురించి అడగట్లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నిధుల పంచాయితీ వచ్చేసరికి భాజపాను నిందిస్తున్నారని, దావోస్‌లో అన్నదమ్ముల మాదిరిగా ఆలింగనం చేసుకున్నప్పుడు ఈ పంచాయితీ ఎక్కడికి పోయిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని