పోలీసుశాఖ భూమిపై వైకాపా నేతల కన్ను

తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలీసుశాఖకు కేటాయించిన భూమిని వైకాపా నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.

Updated : 13 Jun 2022 06:24 IST

డీజీపీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలీసుశాఖకు కేటాయించిన భూమిని వైకాపా నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. వైకాపా కార్యాలయం కోసం పోలీసు శాఖ భూములపైనే ల్యాండ్‌ మాఫియా కన్నేయడం బాధాకరమని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర డీజీపీకి ఆదివారం ఆయన లేఖ రాశారు.‘‘స్థానిక వైకాపా ఎమ్మెల్యే పోలీసులకు సంబంధించిన స్థలంలో రహస్యంగా భూమిపూజ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ స్థలం పోలీసుశాఖది. గతంలో ఇక్కడ పోలీసుల సంక్షేమం కోసం ఒక ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. పోలీసువారి ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత డీజీపీగా మీపై ఉంది. ఇప్పుడు మీరు చర్యలు తీసుకోకపోతే వైకాపా వాళ్లు రాష్ట్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్లు, పోలీసు స్టేషన్లను కూడా ఆక్రమిస్తారు. చంద్రగిరిలో పోలీసుల భూమి అన్యాక్రాంతం కాకుండా నిరోధించాలి’’ అని వర్ల రామయ్య లేఖలో కోరారు.

ప్రభుత్వం రూ.14 వేలిచ్చి.. రూ.40 వేలు లాక్కుంటోంది: గద్దె అనూరాధ 

జగన్‌ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో రూ.14 వేలిచ్చి.. నాన్న బుడ్డితో రూ.40 వేలు లాక్కుంటోందని తెదేపా మహిళా నేత గద్దె అనూరాధ  ఆరోపించారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌, మరణాంధ్రప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో నాటుసారా కారణంగా 230మంది, శానిటైజర్‌ తాగి 52 మంది మరణించారు. జగన్‌ ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం బ్రాండ్లు తాగి ప్రజల ఆరోగ్యాలు నాశనమవుతున్నాయి. దశలవారీగా మద్య నిషేధాన్ని ప్రకటిస్తానని చెప్పిన జగన్‌రెడ్డి మడమ తిప్పారు. వైకాపా నేతల అక్రమ సంపాదన కోసం రాష్ట్రాన్ని నాటుసారా, మద్యం, గంజాయికి కేంద్రంగా మార్చారు. ఈ ప్రభుత్వ తీరుతో మహిళలపై గృహహింస, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి’’ అని  అనూరాధ ఆరోపించారు.

చిన్నమ్మ తాళిబొట్టునే తెంపారు.. ఇతరులను వదులుతారా?: ఆచంట సునీత 

అధికారంలోకి రావడం కోసం సొంత చిన్నమ్మ తాళినే తెంపిన వ్యక్తి రాష్ట్రంలోని ఇతర మహిళల తాళిబొట్లను తెంపరని గ్యారంటీ ఏంటని తెదేపా అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి.. ఇప్పుడు లక్ష్యాలు పెట్టి మరీ మద్యం అమ్మిస్తున్నారని ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. ‘‘మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో పాలన సాగించే స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారు. ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుంది. మద్యం సరఫరా చేసే బాధ్యతను వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డికి అప్పగించి రూ.కోట్లు దోచిపెడుతున్నారు’’ అని సునీత పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని